ఇర‌కాటంలో క‌విత‌…రంగంలోకి కేటీఆర్‌

September 19, 2017 at 9:02 am
KTR, kavitha, TRS, Nizamabad

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కూతురు క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆమెను ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క‌నేత త‌న‌యుడు ప్ర‌త్య‌ర్థి కారుదిగి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో రాజ‌కీయాలు హీటెక్కాయి. అంతేగాక బీజేపీ పెద్ద‌లు కూడా.. నిజామాబాద్‌నే టార్గెట్ చేయ‌డంతో.. ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రి చెల్లి ఇన్ని క‌ష్టాల్లో ఉంటే.. అన్న కేటీఆర్‌ ఊరుకుంటాడా? వెంట‌నే అభ‌య‌హ‌స్తం ఇచ్చేశాడు. చెల్లిని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌పడేసేందుకు త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు అందించాడు. స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌దిద్ది క‌విత‌కు అండ‌గా నిలిచాడు!!

చెల్లి క‌విత అంటే ఎంత అభిమాన‌మో.. తెలంగాణ సీఎం త‌న‌యుడు కేటీఆర్ చాలా సంద‌ర్భాల్లో, బ‌హిరంగ వేదిక‌ల‌పైనే చెప్పారు. ఇప్పుడు త‌న చేత‌ల ద్వారా మ‌రోసారి ఆ అభిమానాన్ని చాటిచెప్పారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వార‌సుల విష‌యంలో పొలిటిక‌ల్ సర్కిల్‌లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు రాజ‌కీయంగా ఇర‌కాటమైన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఆమె సోద‌రుడైన మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో క‌విత‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు త‌న శాఖ త‌ర‌ఫున ఫుల్ స‌పోర్ట్‌ అందిస్తున్నార‌ని విశ్లేషిస్తున్నారు.

నిజామాబాద్ రాజకీయాల‌పై ప‌ట్టున్న సీనియ‌ర్ నేత‌, టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీ‌నివాస్ త‌న‌యుడు టీఆర్ఎస్‌కు గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. ఇది ఎంపీ క‌విత‌కు పెద్ద దెబ్బగా అంచ‌నావేశారు. నిజామాబాద్‌లో డీఎస్ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఈ ప‌రిణామంతో చీలిపోతార‌ని భావించారు. ఇక సెప్టెంబ‌ర్ 17 విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారి కంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్న బీజేపీ ..నిజామాబాద్ వేదిక‌గా సంక‌ల్ప స‌భ నిర్వ‌హించింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా డీఎస్ త‌న‌యుడు స‌హా మ‌రో పారిశ్రామిక‌వేత్త‌, మ‌రికొంద‌రు కాషాయ‌కండువా క‌ప్పుకొన్నారు.

ఈ నేప‌థ్యంలో నిజామాబాద్‌లో ప‌రిణామాలను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు టీఆర్ఎస్ పెద్ద‌లు! పార్టీ ముఖ్య‌నేత త‌న‌యుడు బీజేపీలో చేర‌డం, కేంద్ర హోంమంత్రి ముఖ్య అతిథిగా భారీ స‌భ త‌రుణంలో ఎంపీ క‌వితపై నెగెటివ్ ఎఫెక్ట్ పడ‌కుండా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. కొద్దికాలంగా పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్‌లో ఐటీ హ‌బ్‌కు సంబందించిన అంశాన్ని స‌రిగ్గా ఈ స‌భ జ‌రిగే రోజే క్లియ‌ర్ చేశారు. ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీని విస్త‌రిస్తున్నామ‌ని అందులో భాగంగా నిజామాబాద్‌లో ఐటీ హ‌బ్ ఏర్పాటు చేసి వేలాది మంది ఉపాధి క‌ల్పించ‌నున్నామ‌ని తెలిపారు. దీనిద్వారా త‌న సోద‌రికి కేటీఆర్ అండ‌గా నిలిచార‌ని విశ్లేషిస్తున్నారు.

 

ఇర‌కాటంలో క‌విత‌…రంగంలోకి కేటీఆర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share