టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ‌సూళ్ల దందా ఇలా ఉందా

అవినీతిని అరిక‌ట్టాల్సిన పోలీసులే నేడు అవినీతి బాట ప‌డుతున్నారు. అంటే వారే నేరుగా త‌మ అవ‌స‌రాల కోసం నోట్ల క‌ట్ట‌లు స‌మ‌ర్పించుకునేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఇక‌, స‌మాజంలో ఆద‌ర్శంగా ఉండాల్సిన నేతాశ్రీలు, ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు నోట్ల క‌ట్ట‌ల రుచి మ‌రిగి.. పోలీసుల అవ‌స‌రాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పోలీసుల బ‌దిలీల‌కు రంగం సిద్ధ‌మైంది. రాష్ట్రంలోని ప‌ది జిల్లాల్లోనూ బ‌దిలీలు జ‌రుగుతున్నాయి.

రాష్ట్రంలో త‌మ‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాల‌కు బ‌దిలీ చేయించుకునేందుకు ఎస్సై స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వ‌ర‌కు పోలీసులు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వారు అవినీతికి పాల్ప‌డుతున్నారు. ఎమ్మెల్యేల సిఫార‌సుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీనిని గ‌మ‌నించిన కేసీఆర్ టీం.. పోలీసుల నుంచి రూ. ల‌క్ష‌ల్లో సొమ్ము వ‌సూలు చేస్తోంది. అయితే, పోలీసులు సైతం అడిగినంత ఇచ్చి పోస్టింగ్ పొందేందుకు పోటీ ప‌డుతున్నారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో.. పోస్టింగ్ పొందాక‌.. అంత‌కు నాలుగింత‌లు వెనుకేసుకునేందుకు వారు రెడీ అవుతున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ తప్ప మిగతా అన్ని జిల్లాల్లోని పోలీసు పోస్టింగుల్లో నేతల ప్రభావం సాగుతోందని పోలీసు ఉన్నతాధికార వర్గాలే చెబుతుండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. ఒక అధికారి ఒక పోస్టులో కనీసం రెండేళ్ల పాటు పనిచేయాలంటూ.. సుప్రీంకోర్టు సూచించినా అది అమలు కావడం లేదు. సిఫార్సుల ద్వారా వచ్చిన పోలీసు అధికారులను ఏడాది, ఏడాదిన్నర కాగానే పక్కనపెట్టి.. నేతలు మరో బేరం మాట్లాడుకుంటున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో ఇప్పుడు అవినీతి క‌ట్ట‌లు తెగుతున్నాయ‌ని తెలుస్తోంది.

ఇక‌, ఈ అవినీతి బాగోతంలో నేత‌లు త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌రికి ఒక పోస్టుకు సిఫార్సు చేసి. ఆనక అదే పోస్టుకు ఎక్క‌వు ఇస్తామంటూ ముందుకొచ్చిన వారికి మ‌ళ్లీ అదే పోస్టుకు సిఫార‌సు చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. ఇక‌, కొన్ని జిల్లాల్లో డ‌బ్బుకు బ‌దులు.. ఏదైనా ఖ‌రీదైన గిఫ్ట్ కావాలంటూ నేత‌లే బేరాల‌కు దిగుతున్నారు.

ఇలా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు లంచాలు ఇచ్చి.. పోస్టింగుల‌కు పొందుతున్న వారు వాటిలో చేరాక‌.. అంత‌కు మించి ప్ర‌జ‌ల నుంచి లంచాలు రాబ‌డుతున్నారు. అంతిమంగా రాష్ట్రం.. అవినీతి మ‌యం కావ‌డానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతున్నాయి. మ‌రి వీరిపై కేసీఆర్‌ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.