కేసీఆర్ కూతురికి ఈ టెన్ష‌న్ ఏంటి

September 25, 2017 at 6:11 am
Telangana, TRS, Kavitha, KCR

ఇప్పటివ‌రకూ ఎదురులేకుండా దూసుకుపోతున్న టీఆర్ఎస్‌కు అస‌లైన స‌వాల్ ఎదురుకాబోతోంది! ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్షాలు అన్నీ ఒక్క‌టై మూకుమ్మ‌డి దాడికి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఆయ‌న కుమార్తె, ఎంపీ క‌విత‌కు ప‌రీక్ష ఎదుర‌వ‌బోతోంది. టీఆర్ఎస్‌కు ప‌ట్టున్న 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ఎన్నికలే అయినా.. ఇప్పుడు వీరిలో మ‌రింత టెన్ష‌న్ ప‌డుతున్నారు! సింగ‌రేణి కార్మికులు గుర్తింపు సంఘ ఎన్నిక‌లు అక్టోబ‌రు 5న జ‌రిగే ఎన్నిక‌లు ఎంపీ కవిత‌కు.. ప‌రీక్ష పెట్ట‌బోతున్నాయి! ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కేందుకు ఆమె.. తంటాలు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వంపై వారికి ఉన్న వ్య‌తిరేక‌త‌ను వీలైనంతగా త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికల‌ను ఎంపీ కవిత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఆమె ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం! ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కు అత్యంత కీలకం. గత ఎన్నికల్లో కోల్ బెల్ట్ పరిధిలోని 20 నియోజకవర్గాలను అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈ సీట్ల వల్లనే అధికారంలోకి రాగలగిందని కూడా కేసీఆర్ కు తెలియంది కాదు. కార్మికుల కుటుంబాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే అటువైపే కోల్ బెల్ట్ లోని నియోజకవర్గాల్లో విజయం సాధ్యమవుతుంది. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ద్వారా.. విప‌క్షాల‌కు గ‌ట్టి సమాధానం చెప్పాల‌ని సీఎం కేసీఆర్‌, క‌విత నిర్ణ‌యించుకున్నార‌ట‌.

అందుకే ఎంపీ కవిత కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉండటంతో కేసీఆర్ ఈ ఎన్నికలపై నిత్యం సమీక్షిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో మాట్లాడుతున్నారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వాలతో పనిలేదు. యూనియన్ గట్టిగా ఉంటే ప్రభుత్వాలు మెడలు వంచుకుని పనిచేయించుకునే సత్తా వారికుంది. అందుకోసమే ఐదేళ్ల క్రితం వారు టీఆర్ఎస్ అనుబంధ విభాగమైన సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి గట్టి కార్మిక సంఘాలను పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలపై కార్మికులు మండిపడుతున్నారు. కేసీఆర్ మాట ఇచ్చి తప్పారంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

వారసత్వ ఉద్యోగాలు తమ కొంపముంచుతుందేమోనన్న టెన్షన్ టీఆర్ఎస్ నేతల్లో మొద‌లైంది. దీంతో ఎంపీ కవితతో పాటు మరో ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎంపీ వివేక్ రంగంలోకి దిగారు. ఇక సెంటిమెంట్ ను రాజేస్తున్నారు. మళ్లీ అధికారమిస్తే వారసత్వ ఉద్యోగాలను క‌చ్చితంగా ఇచ్చేలా చూస్తామని కార్మికులకు చెబుతున్నారు. మరోవైపు ఊళ్లను నాశనం చేస్తున్న ఓపెన్ కాస్ట్ గనులను ప్రభుత్వం కానసాగించడంపైనా కార్మిక సంఘాలు అభ్యంతరం చెబుతు న్నాయి. దీంతో కార్మికుల కోపాన్ని చల్లబర్చేందుకే కేసీఆర్ దీపావళి బోనస్, దసరా అడ్వాన్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నార‌ట‌. మొత్తానికి ఈ ఎన్నిక‌లు క‌విత‌ను టెన్ష‌న్ పెడుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు!!

 

కేసీఆర్ కూతురికి ఈ టెన్ష‌న్ ఏంటి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share