ఆ సీనియ‌ర్ లీడ‌ర్ కూతురు, కొడుకు ఇద్ద‌రికి టిక్కెట్లు కావాల‌ట‌!

February 22, 2018 at 10:26 am
TRS-Warangal

వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పటికే తనతోపాటు తన కూతురుకూ టికెట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తనయుడికి కూడా టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ మహా నాయకుడు ఎవరని ఆలోచిస్తున్నారా…? ఆ నాయకుడు మరెవరో కాదు.. మాజీ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్. ప్రస్తుతం డోర్న‌కల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ తనయుడు రవిచంద్ర హల్చల్ చేస్తున్నారు. ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో రవిచంద్రకు కూడా టికెట్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మానుకోట నియోజకవర్గం నుంచి రెడ్యానాయక్ కూతురు, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత టికెట్ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో డోర్న‌కల్ నుంచి రెడ్యానాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచారు. అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు మాలోత్ కవిత మానుకోట నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆమె కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

ప్రస్తుతం మానుకోటలో వచ్చే ఎన్నికల్లో కవితకే టికెట్ వచ్చే అవకాశం మెరుగ్గా ఉంది. డోర్న‌కల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు మానుకోట ఎంపీ సీతారాంనాయక్ కు టికెట్ వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఈసారి రెడ్యానాయక్ ను ఎంపీ గా పంపించి డోర్న‌కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన లో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అయితే సత్యవతిరాథోడ్ కు టికెట్ రాకుండా రెడ్యానాయక్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తనను ఎంపీ గా పంపిస్తే డోర్న‌కల్ టికెట్ తన తనయుడు రవిచంద్రకు ఇవ్వాలని రెడ్యానాయక్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఇదే విషయం పై నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని నెలల కిందట కురవి వీరభద్రస్వామికి మొక్కులు చెల్లించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ను రెడ్యానాయక్ తన ఇంటికి ఆహ్వానించారు. రెడ్యా ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లినప్పటి నుంచే ఎమ్మెల్యే రెడ్యానాయక్ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. తనతోపాటు కూతురు కవితకు టిక్కెట్లు ఓకే అయ్యాయనీ చెప్పుకుంటున్నారు. తాజాగా తనయుడు రవిచంద్రకు కూడా టికెట్ వస్తుందని ముఖ్య సన్నిహితుల వద్ద రెడ్యానాయక్ చెబుతున్నట్లు సమాచారం.

ఆ సీనియ‌ర్ లీడ‌ర్ కూతురు, కొడుకు ఇద్ద‌రికి టిక్కెట్లు కావాల‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share