తెలంగాణ‌లో టీడీపీ దుస్థితి..గ‌తం ఘ‌నం.. భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కం

April 11, 2018 at 4:49 pm
TTDP-

గ‌తంలో తెలంగాణ‌లో వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ ప్ర‌భ‌ను కోల్పోయి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది. నాయ‌కుడు లేక విల‌విల్లాడుతోంది. ఆ పార్టీ భ‌విష్య‌త్‌ గాలిలో దీపంలా మారిపోయింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర పార్టీలు ఎన్నిక‌ల పొత్తుల చ‌ర్చ‌ల్లో బిజీబిజీగా ఉంటే.. టీటీడీపీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అస‌లు ఉందా లేదా అనే ప్ర‌శ్న కూడా రాకమాన‌దు. కీల‌క నేత‌లంద‌రూ వేరే గూటికి చేరిపోగా.. ఉన్న న‌లుగురు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎప్పుడు ఏ చెట్టుపై వాలిపోతారో తెలియని ప‌రిస్థితి. టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలను అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇచ్చినా.. త‌ర్వాత వీటిపై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో ఆ ప్ర‌తిపాద‌న అలానే నిలిచిపోయింది. ప్ర‌స్తుతం టీటీడీపీ ప్ర‌స్తావ‌న లేకుండానే ఎన్నిక‌ల్లో పొత్తుల గురించి ఒక ఆంగ్ల పత్రిక‌లో ప్ర‌చురించిన క‌థ‌నం.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 

 

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకొస్తామంటూ.. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, కొందరు నాయకులు అప్పుడప్పుడు ప్రకటనలు ఇచ్చి పార్టీ శ్రేణుల్లో కొంత ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తెలంగాణ టీడీపీకి రమణ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ బలమైన నాయకుడు కాదు. ఉన్న ఒక్క బ‌ల‌మైన నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోవ‌డంతో టీడీపీలో ఉన్న వారంతా చంద్ర‌బాబుపైనే పూర్తిగా ఆధార‌ప‌డే ప‌రిస్థితి. ఆయన ఎప్పుడైనా వచ్చి సమావేశం నిర్వహిస్తే నేతలంతా చురుగ్గా పాల్గొని.. ‘చూస్కోండి… ఇరగదీస్తాం’ అనే రీతిలో ప్రకటనలు ఇస్తుంటారు. బాబు వెళ్లిపోగానే ష‌రామామూలే. అయితే ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. టీటీడీపీ ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటుంద‌నే చర్చ మొద‌ల‌వుతోంది.  

 

ఏదో ఒక పార్టీతో జ‌త‌క‌డితేనే ఆ పార్టీకి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుంద‌నేలా సంకేతాలిచ్చారు. ఇది పార్టీకి మరింత న‌ష్టం చేకూరుస్తుంద‌ని గ్ర‌హించ‌డంతో ఆ ప్ర‌తిపాద‌న‌కు ఆదిలోనే బ్రేక్ వేశారు. తెలంగాణ‌లో టీడీపీతో పొత్తును బీజేపీ ఏకపక్షంగా రద్దు చేసుకుంది. ఇక టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఏర్పాటు చేయడంతో అంతకు ముందున్న అంచనాల్లో మార్పు వచ్చింది.  సీఎం కేసీఆర్‌కు ఎంత ఇమేజ్‌ ఉందో కోదండరామ్‌కూ అంతే ఉంది. ఇక హైదరాబాదు నగరంలో టీఆర్‌ఎస్‌-ఎంఐఎం మధ్య దోస్తీ ఉంది కాబట్టి ఎంఐఎం స్థానాల్లో అధికార పార్టీ పోటీ చేయదు. హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం జోలికి పోదు. 

 

ఆంధ్రాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేనతో కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణలోనూ ఈ మూడు పార్టీల దోస్తీ కొనసాగుతుందని తెలుస్తోంది. మరో సమాచారం ప్రకారం కోదండరామ్‌ పార్టీతో గాని, కాంగ్రెసుతోగానీ పొత్తు పెట్టుకోవచ్చ‌ట‌. కాంగ్రెసుతో కమ్యూనిస్టులకు అసలు పడదు. కేంద్రంలో బీజేపీనిగానీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌నుగానీ ఓడించాలంటే కాంగ్రెసుతో కలవాలని, ఇందులో తప్పు లేదని సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయం. బీజేపీ తెలంగాణలో కొంత బలంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా లాభపడింది. ఈసారి ఒంటరి పోరాటం త‌ప్ప‌దు.  కాంగ్రెసు, కమ్యూనిస్టులు, కోదండరామ్‌ పార్టీ కలిసి మహాకూటమిగా ఏర్పడవచ్చని ఒక అంచనా. ఇన్ని సాధ్యాసాధ్యాలున్నా టీటీడీపీ ఒంట‌రిగా మిగిలిపోయింది. 

తెలంగాణ‌లో టీడీపీ దుస్థితి..గ‌తం ఘ‌నం.. భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share