మంత్రి ఆదికి లోప‌లో శ‌త్రువు…బ‌య‌టో శ‌త్రువు

మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిది మామూలు ల‌క్ కాదు. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మిన‌బంటుగా ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీలోకి జంప్ చేయ‌డం, ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్పుడు క‌డ‌ప జిల్లాలో ఆదినారాయ‌ణ‌రెడ్డి హ‌వా ఓ రేంజ్‌లో కంటిన్యూ అవుతోంది. జిల్లా రాజ‌కీయాల‌ను ఆయ‌న శాసిస్తున్నారు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డికి ఇరువైపుల నుంచి మ‌ద్దెల‌ద‌రువు త‌ప్పేలా లేదు. ఆయ‌న లోప‌లో శ‌త్రువు, బ‌య‌టో శ‌త్రువును ఎదుర్కోక‌త‌ప్పేలా లేదు. జమ్మ‌ల‌మ‌డుగు టీడీపీ రాజ‌కీయాల్లో గ‌త రెండు ద‌శాబ్దాలుగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హ‌వా కొన‌సాగుతోంది. ఆదిని టీడీపీలో చేర్చుకునే విష‌యంలో ఆయ‌న ఎన్ని అభ్యంత‌రాలు పెట్టినా చంద్ర‌బాబు మాత్రం ఆదిని టీడీపీలోకి తీసుకున్నారు.

ఆది టీడీపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో రామ‌సుబ్బారెడ్డి మ‌రింత ర‌గిలిపోతున్నారు. రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామ‌న్నా ఆ హామీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నెర‌వేరుతుందా ? అన్న‌ది డౌట్‌గానే ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయన వైసీపీలోకి వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని తెలుస్తోంది.

ఇక రామ‌సుబ్బారెడ్డి టీడీపీలోనే ఉన్నా ఆయ‌న ఆదికి స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే. ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి పేరు దాదాపు ఖ‌రారైనట్టే. ఆయ‌న‌కు స్థానికంగా మంచి ప‌ట్టు ఉంది. ఏదేమైనా ప్ర‌స్తుతం జ‌మ్మ‌ల‌మ‌డుగులో రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే మంత్రి ఆదికి టీడీపీలో రామ‌సుబ్బారెడ్డి, వైసీపీలో సుధీర్‌రెడ్డి ఇద్ద‌రు శ‌త్రువులు త‌యారైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.