సీమ‌లో వైసీపీకి షాక్‌… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే త‌మ్ముడు జంప్‌

September 13, 2017 at 7:37 am
YSRCP, Rayalaseema, TDP, Gurnada reddy, Madusodhan reddy

ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని విస్తృతంగా ప్ర‌య‌త్నిస్తున్న విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆయ‌న‌కు ఏం చేయాలో దిక్కు తోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఇప్పుడు కొద్దో గొప్పో బ‌లంగా ఉన్న నేత‌లు, నియోజ‌క‌వ‌ర్గాలు సైతం జ‌గ‌న్ చేయి జారిపోతున్నాయ‌నే వార్త‌లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమ‌లో వైసీపీకి పెట్ట‌ని కోట‌లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

సీమ‌కు చెందిన ప‌లువురు వైసీపీ కీల‌క నేత‌లు త్వ‌ర‌లోనే పార్టీ నుంచి జంప్ చేస్తార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే రంగం సిద్ధ‌మైంద‌ని, జ‌గ‌న్‌తో ఉంటే లాభం లేద‌ని వారు నిర్ణ‌యించుకున్నార‌ని ఆయా నేత‌ల అనుచ‌రులు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఈ క్ర‌మంలో సీమ‌లో జ‌గ‌న్ ప‌ని ఖ‌తం అనే క‌ఠిన వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు సైకిల్ సవారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ‌రెడ్డి టాటా చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈయ‌న‌తో పాటు ఉరవకొండకు చెందిన ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి త‌మ్ముడు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి గుర్నాథ‌రెడ్డి.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంత‌రం ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఫ్యాన్ గుర్తుపై విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి అనంతపురం వైసీపీ ఇన్ ఛార్జిగా కొన‌సాగుతున్నారు. అయితే, గత కొంతకాలంగా గుర్నాథ‌రెడ్డి యాక్టివ్ గా లేకపోవడంతో ఆయన స్థానంలో మైనారిటీ నేత నదీం అహ్మద్ ను జగన్ నియమించారు. దీంతో గురునాధరెడ్డి ప్రాధాన్యత అనంతపురం నియోజకవర్గంలో తగ్గిపోయింది.

వచ్చే ఎన్నికల్లో అనంతపురం వైసీపీ టిక్కెట్ నదీంకే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో గుర్నాథ రెడ్డి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల నేప‌థ్యంలో టీడీపీ నేతలతో ఆయన సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో గురునాధరెడ్డి టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెల‌కొంది. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

విశ్వేశ్వరరెడ్డి కంటే ఉరవకొండలో మధుసూదన్ రెడ్డికే పట్టు ఎక్కువ. కుటుంబ తగాదాలనేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డి టీడీపీలోచేరుతున్నట్లు తెలిసింది. మధుసూదన్ రెడ్డి చేరికకు స్థానిక నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సైతం పచ్చజెండా ఊపారు. దీంతో ఈ ఇద్దరు నేతలూ త్వరలోనే టీడీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే రాయలసీమలో వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతేన‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ దీనిని ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

 

 

సీమ‌లో వైసీపీకి షాక్‌… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే త‌మ్ముడు జంప్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share