ఉత్త‌మ్‌కి ప‌ద‌వీ గండ‌మా?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ప‌దవీ గండం భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో ఆయ‌న వాస్తు నియ‌మాలు పాటిస్తున్నార‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వాస్తును న‌మ్మిన విష‌యం తెలిసిందే. వాస్తు భ‌యంతోనే ఆయ‌న బంగారాలంటి స‌చివాల‌యాన్ని త్వ‌ర‌లోనే కూల‌గొట్టి అధునాత‌నంగా నిర్మించుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ఇలాంటి వాస్తు భ‌య‌మే ఉత్త‌మ్‌నీ వెంటాడుతోంద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు ఆయ‌న పీసీసీ ప‌ద‌వికి ఎస‌రు వ‌చ్చింది.

ప్ర‌తిసారీ ఏదో ఒక‌ర‌కంగా ఆయ‌న బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు. తాజాగా మాత్రం ఆయ‌న భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే అప‌జ‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇప్ప‌టి నుంచే త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌స్తుతం ఉన్న గాంధీ భ‌వ‌న్ వాస్తు బాగోలేద‌ని అంటున్నార‌ట‌. గాంధీభవన్ లో వాస్తు దోషాలున్నాయని పండితులు చెప్పడంతో ఆయన వచ్చే ఎన్నికల ఫలితాలతో పాటుగా పీసీసీ చీఫ్ పదవి పోతుందనే బెంగ ఎక్కువయింద‌ని అంటున్నారు స‌న్నిహితులు.

అందుకే గత కొన్ని రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చే మార్గాన్ని మార్చుకున్నారు. నిన్న మొన్నటి వరకూ వచ్చే దారి కాకుండా కొత్త దారిలో వస్తూ, వెళుతున్నారు. దీనిపై గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. సాధారణంగా పీసీసీ చీఫ్ గాంధీభవన్ కు వస్తున్నారంటే అటెండర్లు ఆయన కోసం సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రతిరోజూ వచ్చే మార్గం వైపే నిల్చుని ఉంటారు. కానీ ఉత్తమ్ మాత్రం దారి మార్చుకోవడంతో అటెండర్లు విస్తుపోతున్నారు. గాంధీభవన్ కు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తూర్పు నుంచి వచ్చి ఉత్తరం నుంచి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి.

పీసీసీ చీఫ్ పదవి కోసం సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో తన పదవికి ముప్పు ఏర్పడుతుందేమోనని ఉత్త‌మ్‌కి భయం పట్టుకుంది . దీంతో ఇటీవ‌ల ఆయ‌న కొంద‌రు పండితుల‌ను సంప్ర‌దించాడ‌ట‌. వారు అంతా ప‌రిశీలించి.. గాంధీభవన్ లో వాస్తు దోషాలున్నాయని, వచ్చే, పోయే దారి మార్చుకోవాలని సూచించార‌ట‌. దీంతో ఉత్త‌మ్‌.. ఇప్పుడు తన రూట్ మార్చినట్లు తెలిసింది. ఇక‌, రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు జ‌రుగుతాయో చూడాలి.