ఒక్క ప్రాబ్ల‌మ్‌తో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విల‌విల‌

టీడీపీకి కంచుకోట‌లాంటి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా ఒకే ఒక్క స‌మ‌స్య ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపోట‌ముల‌ను శాసించే శ‌క్తిగా మారింది. ఈ స‌మ‌స్య దెబ్బ‌తో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు విల‌విల్లాడుతున్నారు.

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఈ జిల్లాలో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని తుందుర్రు వ‌ద్ద నిర్మిస్తోన్న మెగా అక్వా ఫుడ్ ఫ్యాక్ట‌రీతో గోదావ‌రి డెల్టాతో పాటు గొంతేరు కాల్వ విష‌తుల్యంగా మారి మ‌నుష్యుల‌తో పాటు జంతుజాలం, అక్క‌డ వ్య‌వ‌సాయంతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయంటూ స‌మీపంలోని గ్రామాల ప్ర‌జ‌లు కొద్ది రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు.

ఈ ఫుడ్ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల డెల్టాలోని భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యావ‌ర‌ణం, జ‌నాలు, వ్య‌వ‌సాయానికి తీవ్ర ఇబ్బందులు క‌ల‌గ‌నున్నాయి. ల‌క్ష‌లాది ఎక‌రాల సాగుకు ఇబ్బందులు త‌ప్పేలా లేవు. అక్క‌డ ఫుడ్ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెపుతున్నా అక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న ఫ్యాక్ట‌రీ వ‌ల్ల జ‌రుగుతున్న ప్ర‌మాదాలు చూస్తుంటే అవ‌న్నీ సందేహాలుగానే ఉన్నాయి. ప్ర‌స్తుతం న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వ‌ల్ల స‌మీపంలోని నీరు, ప‌ర్యావ‌ర‌ణం తీవ్రంగా కాలుష్యానికి గుర‌వుతున్నాయి.

ఇక మెగా అక్వా ఫుడ్ పార్క్ నిర్మాణంలో ఇటీవ‌ల ఐదుగురు కార్మికులు సైతం మృతిచెందారు. ఇక్క‌డ ఇంత ప్ర‌మాదం జ‌రుగుతున్నా ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం ఈ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది లేద‌ని వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ పోరాటం చేస్తోన్న వారిపై ఇప్ప‌టికే చాలా కేసులు న‌మోద‌య్యాయి. గోదావ‌రి అక్వా ఫుడ్ పార్క్‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రైనా పోరాటం చేస్తుంటే చాలు వారిపై ఏదో ఒక కేసు బ‌నాయించి జైల్లో పెట్టేస్తున్నారు.

ఈ ఫ్యాక్ట‌రీ నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ చేస్తోన్న పోరాటానికి ముందుగా క‌మ్యూనిస్టులు మ‌ద్ద‌తు ఇవ్వ‌గా ఆ త‌ర్వాత విశ్వ‌మాన‌వ‌వేదిక అధ్య‌క్షులు మ‌ల్లుల సురేష్ ఈ స‌మ‌స్య‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఈ స‌మ‌స్య రాష్ట్ర‌వ్యాప్త‌మైంది. ఆ త‌ర్వాత వైసీపీ సైతం వీళ్ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. ఈ తుందుర్రు ఫుడ్ పార్క్ ఎఫెక్ట్‌తో ఇప్పుడు డెల్టాలోని భీమ‌వ‌రం ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి అంజిబాబుతో పాటు న‌ర‌సాపురం ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడు, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల విజ‌యావ‌కాశాల‌పై ఈ ఫుడ్ పార్క్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే ఉండ‌నుంది.

ఇక్క‌డ రోజు రోజుకు పోరాటం ఉధృత‌మ‌వుతున్నా ప్ర‌భుత్వం నుంచి బాధితుల‌కు బాస‌ట‌గా ఎవ్వ‌రూ రాక‌పోవ‌డంతో వారంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఓటుతో బుద్ధి చెప్పేందుకు స్ట్రాంగ్‌గానే డిసైడ్ అయిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.