జేసీ రాజానామాకు ఆ ఇద్ద‌రే కార‌ణ‌మా..!

పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌, అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సృష్టించిన సంచ‌ల‌నం రాజ‌కీయంగా పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. త‌న ప‌ద‌వికి నిన్న‌టికి నిన్నే రాజీనామా చేయాల‌ని డిసైడ్ అయ్యాన‌ని, అయితే, స్పీక‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డంతో వెన‌క్కి త‌గ్గాన‌ని, త‌న‌కు అస్స‌లు ఈ ప‌ద‌విలో ఒక్క క్ష‌ణం కూడా ఉండేందుకు ఇష్టం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం లేదా వీలైతే మంగ‌ళ‌వారే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పి పెద్ద సంచ‌ల‌నానికి తెర‌దీశారు.

దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెను ప్ర‌కంప‌న మొద‌లైంది. సాక్ష‌త్తూ సీఎం చంద్ర‌బాబే దీనిపై ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. అనంత పురం రైతుల‌కు సాగునీరు అంద‌క‌పోవ‌డం వ‌ల్లే.. జేసీ ఇలా ఫైరై ఉంటార‌ని, రాజీనామా ప‌ర్వానికి సిద్ధ‌ప‌డి ఉంటార‌ని భావించిన బాబు.. వెంట‌నే మంత్రి దేవినేని ఉమాను రంగంలోకి దింపి కొంత‌మేర‌కు స‌మ‌స్య సానుకూల మ‌య్యేలా చూశారు. ఇక‌, ఇప్పుడు జేసీ కొంత మేర‌కు మెత్త‌బ‌డ్డార‌ని స‌మాచారం. అయితే, జేసీ ఇలా రాజీనామా ప్ర‌క‌ట‌న చేయ‌డంపై అదే జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు ఉన్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీతల వైఖ‌రితో జేసీ విసిగిపోయి ఇలా రాజీనామాకు సిద్ధ‌ప‌డి ఉంటార‌ని చెబుతున్నారు. టీడీపీలో త‌న‌కు ఏదైనా గౌర‌వ ప్ర‌ద‌మైన ప‌ద‌వి ఇస్తే బాగుంటుంద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో జేసీ చెప్ప‌కొచ్చారు. ఇదిలావుంటే, జేసీ దివాకర్ రెడ్డి గత కొంత కాలంగా స్థానిక నేతలు, మంత్రులపై అసంతృప్తితో ఉన్నారు. అనంతపురం ఎంపీగా తాను ఉన్నప్పటికీ ఎటువంటి సమాచారం లేకుండానే మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ఇటీవ‌ల‌ ఆరోపించారు. దీనికి తోడు జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా దేవినేని ఉమా వచ్చిన తర్వాత మరింత ఏకపక్షమై పోయిందంటున్నారు.

ఎంపీగా ఉన్న తనను సంప్రదించకుండనే నిర్ణయాలు తీసుకోవడం నచ్చడం లేదు. మరోవైపు అనంతపురం అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ గా చమన్ ను నియమిస్తారన్న వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా చమన్ కు హామీ ఇచ్చారని తెలుస్తోంది. తన వైరి వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెడుతూ తనను పట్టించుకోవడం పై జేసీ కుతకుత లాడిపోయారు.

అంతేకాదు చాగల్లు కు తాగునీటిని అందిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు అంగీకరించినా జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మంత్రులదే పెత్తనమై పోయింది. దీంతో జేసీ మనస్తాపం చెంది రాజీనామాకు సిద్ధపడినట్లు తెలిసింది. ఏదేమైనా.. జేసీ ప్ర‌క‌ట‌న తాటాకు మంట‌ను త‌ల‌పిస్తుందో. భోగి మంట‌ను త‌ల‌పిస్తుందో చూడాలి.