సీఎంగా బాబు – విప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌: ఎవ‌రు బెస్ట్‌… ఎవ‌రు వేస్ట్‌

ఒకరు సీఎం, మ‌రొక‌రు విప‌క్ష నేత ఇద్ద‌రూ బ‌లంగా ఉన్న నేత‌లే. అయినా కూడా ఏపీకి ఏమీ సాధించ‌లేక‌పోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. సీఎంగా అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు, విప‌క్ష నేత‌గా యువ‌నేత జ‌గ‌న్‌లు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న‌వారి ఆశలు ఇప్ప‌డు అడియాశ‌లే అవుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ క్ర‌మంలో అంద‌రూ జ‌గ‌న్ సీఎం సీటు ఎక్క‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు నిద్ర‌లేని రాత్రులే గ‌డిపారు. అయితే, అనూహ్యంగా ఏపీ ప్ర‌జ‌లు అనుభ‌వానికి ప‌ట్టం క‌ట్టారు.

జ‌గ‌న్‌ను కూడా భారీ మెజారిటీతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కూర్చోబెట్టారు. అయితే, ఇద్ద‌రూ యాక్టివ్‌లోకి వ‌చ్చి మూడున్న‌రేళ్లు గ‌డిచాయి. కానీ, చెప్పుకోద‌గ్గ రిజ‌ల్ట్ చూపించ‌లేక పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు ఎంత సేపూ ప్ర‌చారార్భాటానికే ప‌రిమితం అవుతున్నారు. ముఖ్యంగా 2018 నాటికి పూర్త‌వుతుందో లేదో తెలియ‌ని పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌ట్టుకునిఆయ‌న వేలాడుతున్నారు. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప్రాజెక్టు అని చెప్పుకొంటున్నా బాబు దీనిని వీడ‌డం లేదు. రాష్ట్రంలో ఇంకేమీ ప‌నులు లేన‌ట్టు దానినే న‌మ్ముకున్నారు. అదేవిధంగా రాజ‌ధాని విష‌యంలో ఇంత‌వ‌ర‌కు ఒక కొలిక్కి తీసుకురాలేక‌పోతున్నారు.

ఇదిలావుంటే, త‌న అధికార వ్యామోహాన్నిసైతం బాబు బ‌య‌ట పెట్టుకున్నారు. 2019లో అధికారంలోకి వ‌స్తే బాగుంటుంద‌ని తొలుత మాట వ‌ర‌స‌గా చెప్పిన బాబు.. అనూహ్యంగా దానినే ప‌ట్టుకుని వేలాడుతున్నారు. అంతేకాదు, త‌న గెలుపు మాట‌ల‌ను కోట‌లు దాటించేస్తున్నారు. వ‌చ్చే 2050 వ‌ర‌కు కూడా తానే అధికారంలో ఉండాల‌ని ఆయ‌న చెబుతున్నారు. ఆ దిశ‌గానే చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రి ఇంత వ్యామోహం ఎందుకో అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే త‌న కుమారుడు లోకేష్‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

అయినా కూడా బాబు అధికార దాహం తీర‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాన విప‌క్షంగా నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డంలో ప్ర‌ధాన భూమిక పోషించాల్సిన వైసీపీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రిని ఇటీవ‌ల కాలంలో మ‌రింత విమ‌ర్శ‌నాత్మ‌కంగా మారింది. 2019పై క‌న్నేసిన ఆయ‌న ఎంత సేపూ సీఎం సీటు జ‌పం చేస్తూనే ఉన్నారు త‌ప్ప‌, ఏపీ ప్ర‌జ‌ల బాగోగుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, ఏమాత్రం కేడ‌ర్ లేని ప‌వ‌న్ బెట‌ర్ అని అంద‌రూ అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ ప‌రిస్థితి రావ‌డానికి జ‌గ‌నే కార‌ణ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

త‌న కు అధికారం కావాలి స‌రే.. కానీ, ప్ర‌జ‌ల్లో సానుభూతి ఏర్ప‌రుచుకోవాలి క‌దా. తొమ్మిదేళ్లు పాలించిన చంద్ర‌బాబు కూడా ప్ర‌జ‌ల సానుభూతి కోసం 60 ఏళ్ల వ‌య‌సు దాటాక పాద‌యాత్ర చేశారు. ఈ విష‌యాన్ని మ‌రిచిన జ‌గ‌న్‌.. ఇంకా హైద‌రాబాద్ నుంచేరాజ‌కీయాలు చేస్తున్నారు. సో.. ఇలా చెప్పుకొంటే అనేక విష‌యాలు ఉన్నాయి. ఏదేమైనా ఇద్ద‌రూ కూడా ఏపీ ప్ర‌జ‌ల‌కు నిఖార్సుగా చేస్తున్న సేవ ఏంద‌ని చూస్తే.. పెద్ద జీరో క‌నిపిస్తోంది.