వెంకయ్యపై కుట్ర.. వెనుక ఎన్ని చేతులో!

అవును! ఇప్పుడు దాదాపు అంద‌రూ ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు! ఏపీ తెలంగాణ‌ల్లో అత్యంత సీనియ‌ర్ బీజేపీ నేత వెంక‌య్య‌నాయుడు. అలాంటి నేత‌ను ఇప్పుడు ఉన్న ప‌ళాన ఎలాంటి రాజ‌కీయ ప్రాధ‌న్యం లేని కేవ‌లం రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వి అయిన ఉప‌రాష్ట్ర‌ప‌తికి ప‌రిమితం చేయ‌డం? రాజ‌కీయాల‌పై క‌నీసం మాట మాత్ర‌మైనా మాట్లాడే అవ‌కాశం లేకుండా చేయ‌డం? వ‌ంటి ప‌రిణామాలు నిజంగా వెంక‌య్య వెనుక ఏదో జ‌రిగిన అనుమానాల‌కు తావిస్తున్నాయి. మైకు ప‌ట్టుకుంటే అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌డ‌మే కాదు, త‌న‌కే ప్ర‌త్యేక‌మైన ప్రాస ప‌దాల‌తో విప‌క్ష నేత‌ల‌పై వ్యంగ్యోక్తులు రువ్వుతూ అంద‌రినీ క‌డుపుబ్బ న‌వ్వించే రాజ‌కీయ చ‌తుర‌త వెంక‌య్య సొంతం. అలాంటి వెంక‌య్య‌ను నేడు రాజ‌కీయాల‌కు దూరం చేశారంటే.. ఏదో జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. మ‌రో రెండేళ్ల‌లో దేశంలో అత్యంత కీల‌క‌మైన సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ‌ల్లో ఎద‌గాల‌ని, సొంతంగా జెండా పాతాల‌ని భావిస్తున్న బీజేపీకి ఈ ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. అయితే, ఇక్క‌డి రాష్ట్రాల‌పై ప‌ట్టు, ఇక్క‌డి నేత‌ల‌తో క‌లిస‌పోగ‌ల‌, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఒప్పించ‌గ ల నేత బీజేపీకి త‌క్ష‌ణావ‌స‌రం. అలాంటి ఏకైక నేత వెంక‌య్య‌నాయుడు. అయితే, అనూహ్యంగా ఆయ‌న‌ను బీజేపీ అధిష్టానం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంపేస్తోంది. ఈ ప‌రిణామం ఇరు రాష్ట్రాల్లోని బీజేపీ నేత‌ల‌ను(వెంక‌య్య వ‌ర్గం) తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేసింది. అయితే, దీని వెనుక మ‌రో తెలుగు నేత రామ్ మాధ‌వ్ ఉన్నాడ‌ని ఆల‌స్యంగా వెలుగు చూసింది.

బీజేపీ అధిష్టానం ఏపీ పార్టీ ప‌ర్య‌వేక్ష‌క‌ బాధ్యతలను రామ్ మాధవ్ కి అప్పగించింది. ఆయన స్కూల్ స్టార్ట్ చేయడంతో ఏపీలో ఎదగాలంటే వెంకయ్యను గౌరవంగా పక్కన పెట్టాలనే వ్యూహం తెరమీదకు వచ్చిందని స‌మాచారం. ముఖ్యంగా త‌మ‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్ప‌డు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర ఆవేద‌న‌తో ఉన్న సోము వీర్రాజు వ‌ర్గం.. ఈ విష‌యంలో రామ్ మాధ‌వ్‌కి సాయం చేసింద‌ని తెలుస్తోంది. అంటే ఒక‌ర‌కంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా ఎద‌గాలంటే.. బాబును ఎద‌రించాల్సిందేన‌ని వీరి వ్యూహం. కేంద్రం ఇస్తున్న డ‌బ్బుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా.. అంతా తానే చేస్తున్న‌ట్టు బాబు బిల్డ‌ప్ ఇస్తున్నాడ‌ని వీరి వాద‌న‌.

ఇలా అయితే, బీజేపీ ఎన్న‌టికీ ఏపీలో ఎద‌గ‌ద‌ని కూడా వీరు చెబుతున్నారు. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు వీరంద‌రినీ వెంక‌య్య కంట్రోల్ చేశారు. బాబును ఒక్క‌మాట కూడా అన‌డానికి వీలు లేకుండా క‌ట్ట‌డి చేశారు. దీంతో సోము వీర్రాజు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అన్న‌గారి కూతురు పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, కావూరి సాంబ‌శివ‌రావు వంటి వారు వెంక‌య్య‌ను మౌనంగానే భ‌రిస్తూ వ‌చ్చారు. అయితే, రామ్ మాధ‌వ్ ఎంట్రీతో వీరంతా వెంక‌య్య‌ను త‌ప్పించ‌డంపై దృష్టి పెట్టార‌ని స‌మాచారం. ఇక‌, ఇదే విష‌యాన్ని మాధ‌వ్ కేంద్రంలో వివ‌రించ‌గానే స‌మ‌యం చూసుకుని అధిష్టానం వెంక‌య్య‌ను సాగ‌నంపుతోంద‌ని అంటున్నారు. మొత్తానికి రామ్ మాధ‌వ్ ఎంట్రీతో వెంక‌య్య‌కు రాజ‌కీయ స‌మాధి జ‌రిగింద‌ని అంటున్నారు.