కాపుల‌కు కాపు కాస్తావ్‌….. మ‌రి హామీలెందుకు ఇవ్వ‌వ్ జ‌గ‌నూ..!

వ్రతం చెడ్డా ఫ‌లితం ద‌క్కింద‌నేది తెలుగు సామెత‌. కానీ వృతం చెడింది.. ఫ‌లినేతం కూడా రాలేద‌న్న‌ట్లుగా మారిందిప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌రిస్థితి. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీద‌కు వ‌చ్చాక ఆంధ్రప్ర‌దేశ్‌లో ప‌రిస్థితుల్లో చాలా మార్పు వ‌చ్చింది. ఎప్ప‌డు ఎన్నిక‌లొచ్చినా ఇదే అంశం ప్ర‌భావం చూప‌తుంద‌ని అంద‌రూ భావించారు. ప్ర‌త్యేక హోదా అంశం త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్నిఅంతంగా కుదిపేసిన అంశం ఏదైనా ఉందంటే అదీ కాపు రిజ‌ర్వేష‌న్లే. మ‌రీ ముఖ్యంగా వేరే అంశమే లేద‌న్న‌ట్లుగా వైసీపీ నేత‌లు కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో స‌మానంగా భుజానికెత్తుకుని మోసి రాజ‌కీయం ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూశారు. ఇప్పుడు అదే అంశం వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని అయోమ‌యంలోకి నెట్టింది.

నిజానికి కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వాన్నిఇర‌కాటంలోకి నెట్టాల‌ని చూశాయి. అధికారంలో ఉన్న తెలుగు దేశాన్ని ఈ అంశాన్ని ఉప‌యోగించుకుని ఆ సామాజిక వ‌ర్గంలో వ్య‌తిరేకత కూడ‌గట్టాల‌ని ప్ర‌య‌త్నించాయి. జ‌గ‌న్ మొద‌లుకుని ఆ పార్టీకి చెందిన అన్నిస్థాయిల్లో నాయ‌కులు ఇదే అంశంపై మాట్లాడి లబ్ది పొందాల‌ని చూశారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం విజ‌యమే ఇందుకు కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో కాపు సామాజికవ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌తోపాటు కొస్తా ఆంధ్ర‌లో చాలా జిల్లాల్లో తెలుగుదేశం తిరుగులేని విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కాపు సామాజిక వ‌ర్గాన్ని మ‌చ్ఛిక చేసుకునే ప‌నిలో వైసీపీ నాయ‌కులు ప‌డ్డారు. వీరికి ముద్ర‌గ‌డ రూపంలో ఓ అస్త్రం దొరికింది. ముద్ర‌గ‌డను ముందు ఉంచి వైసీపీ నాయ‌కులు కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం తెలుగుదేశం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. నంద్యాల ఎన్నిక‌ల‌తోపాటు ముఖ్యంగా కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వైసీపీని తీవ్రంగా దెబ్బ‌కొట్టాయి.

కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంను అడ్డం పెట్టుకుని కాకినాడ‌ను కైవ‌శం చేసుకోవాల‌ని వైసిపి భావించినా.. ప్ర‌జ‌లు మాత్రం తెలుగుదేశానికి ప‌ట్టం క‌ట్టారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌లుమార్లు కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై మాట్లాడినా.. ఎక్క‌డా తాము అధికారంలోకి వ‌స్తే ఇంత శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని మాత్రం చెప్ప‌లేదు. దీనిని బ‌ట్టి కాపుల ప‌ట్ల జ‌గ‌న్‌కు ఉన్న ద్వంద వైఖ‌రిపై చాలా మంది ప‌లు సందేహాల‌తో కూడిన ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.