జ‌గన్‌పై కేసులూ 2జీలూ… దూదిపింజ‌లేనా..!

December 23, 2017 at 10:56 pm

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన 2-జీ కుంభ‌కోణం కేసు వీగిపోయిన ఉందంతం ఏపీలోనూ రిపీట్ అవుతుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ రిటైర్డ్ అధికారులు! ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై అనేక కేసులు ఉన్నాయి. అటు సీబీఐ, ఇటు ఈడీ సంయుక్తంగా ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసింది. దాదాపు ఏడాదికి పైగా జైలు జీవితం కూడా అనుభ‌వించాడు. ఇప్ప‌టికీ వారానికి ఒక రోజు కోర్టుకు కూడా వెళ్తున్నాడు. అదేవిధంగా ఇప్ప‌టికే అనేక ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. కొన్ని కేసుల్లో చార్జ్ షీట్లు న‌మోదైనా. ఇప్ప‌టికీ అవి కోర్టుకు చేర‌లేదు. పైగా మ‌రికొన్ని కేసుల్లో ఇంకా చార్జ్ షీట్లు త‌యారే కాలేదు. దీంతో ఈ కేసులు కూడా 2-జీ కేసుల మాదిరిగానే వీగిపోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు ఢిల్లీలెవిల్లోనే వినిపిస్తున్న‌యి. తాజాగా మ‌రో కేసు విష‌యంలోనూ సీబీఐ చ‌తికిల ప‌డింది. 

మ‌హారాష్ట్ర‌లో భారీ ఎత్తున వెలుగులోకి వ‌చ్చిన ఆద‌ర్స్ హౌసింగ్ సొసైటీ కుంభ‌కోణం కేసు కూడా తాజాగా వీగిపోయింది. అప్ప‌టి సీఎం అశోక్ చ‌వాన్‌పై సీబీఐ కేసు న‌మోదు చేయ‌గా తాజాగా ఆధారాలు లేవంటూ ఆయ‌న‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించారు. దీంతో రాబోయే రోజుల్లో ఏపీలోనూ జ‌గ‌న్ నిర్దోషిగా, పులుక‌డిగిన ముత్యంగా బ‌య‌ట‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు సీనియ‌ర్ అధికారులు. ఇక‌, ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ అండ్ పార్టీ కూడా ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చింది. త‌న‌పై న‌మోదైన కేసుల్లో ఏ ఒక్క‌టీ వాస్త‌వం కాద‌ని, ఇవ‌న్నీ రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఇక‌, ఇదే కేసులో ఉన్న ప‌లువురు అధికారులు కూడా ఈ కేసుల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని కోర్టులో నిరూపించుకుని కేసుల నుంచి విముక్తి పొందారు. వీరిలో ఒక‌రిద్ద‌రు జ‌గ‌న్ వెంట జైలుకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. 

అయితే, వీరిపై సీబీఐ ఎక్క‌డా నేరం నిరూపించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాబోయే రోజుల్లో జ‌గ‌న్‌పై న‌మోదైన కేసులు కూడా ఇలానే వీగిపోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరుతోంది. దివంగ‌త‌ వైఎస్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న తండ్రి  అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించారని ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఆయా కేసుల్లో జగన్ జైలు జీవితం కూడా గ‌డిపాడు. తరువాత బెయిల్‌పై  బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆయన కేసులపై కోర్టులో విచారణ జరుగుతున్నాయి. కేవలం ఆయనపైనే కాకుండా ఆయనకు సహకరించారని కొందరు ఐఎఎస్‌ అధికారులు, స‌బితా రెడ్డి వంటి రాజకీయ నాయకులు కూడా ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఆయనపై   ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌ వంటి కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం ప్రతిశుక్రవారం జగన్‌ కోర్టులకు హాజరవుతున్నాడు. 

ఈ కేసుల్లో విచారణ చివరి దశకు వస్తోంది. కొన్ని కేసుల్లో ఇప్పటికే కొందరు ఐఎఎస్‌ అధికారులు, ఇతర పారిశ్రామికవేత్తలకు సంబంధం లేదని వారిని తప్పించారు. వీరిని తప్పిస్తే…తమ నేత కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ప‌లువురు సీనియ‌ర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి కూడా ఈ కేసులు నిలబడబోవని, రాజకీయ కక్షతో పెట్టిన కేసులని ఆయన జ‌గ‌న్ మీడియా సాక్షి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వాస్త‌వానికి దేశంలో అతి పెద్ద కుంభకోణంగా భావించిన‌ 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించడంతో జ‌గ‌న్ శిబిరంలో ఆనందం నిండింది. తమ నేతకు అటువంటి తీర్పే వస్తుందని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు ఆశిస్తున్నాయి. 

కాగా…2019లో రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పెద్దలు డీఎంకేకు సహాయం చేశారనే భావన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జగన్‌ మొదటి నుంచి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటున్న విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. ప్ర‌ధానిగా మోడీ ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌క‌ముందుగానే వెళ్లి విష్ చేసివ‌చ్చాడు జ‌గ‌న్‌. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అడ‌గీ అడ‌గ‌గానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ రాష్ట్రంలోని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నాడే కానీ, కేంద్రంపై ఒక్క‌మాటా అన‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో జ‌గ‌న్‌పై కేసులు కూడా 2-జీ మాదిరిగానే దూది పింజ‌ల్లా తేలిపోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. 

జ‌గన్‌పై కేసులూ 2జీలూ… దూదిపింజ‌లేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share