జ‌గ‌న్ అగ్ని ప‌రీక్ష‌లో ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు గెలుస్తారా..!

రాజకీయంగా ద‌శాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పెట్టిన అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోనున్నారు. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో మాజీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇద్ద‌రూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్ద‌రు త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కులు ప‌దేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు. 

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయ‌న అనుచ‌రులుగా తిరుగులేని పెత్త‌నం చెలాయించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు కాంగ్రెస్ ఖ‌ల్లాస్ కావ‌డంతో వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ చెంత‌కు చేరారు. వీరిలో ధ‌ర్మాన ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక బొత్స గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పునే పోటీ చేసి ఓడిపోయి ఆ త‌ర్వాత వైసీపీలో చేరారు.

రాజ‌కీయ పున‌రావాసం కోసం వైసీపీలో చేరిన వీరిద్ద‌రు వైసీపీలో ముందునుంచి చేరిన వారిని ప‌క్క‌న పెట్టేసి ఇక్క‌డ కూడా పెత్త‌నం స్టార్ట్ చేసేశారు. దీంతో ఇప్పుడు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వీరిద్ద‌రి ఏక‌ప‌క్ష దెబ్బ‌తో వైసీపీ నాశ‌న‌మ‌వుతోంది. బొత్స ఎంట్రీతో బొబ్బిలి రాజులు వైసీపీకి గుడ్ బై కొట్టేసి టీడీపీలో చేరిపోయారు. ఇక శ్రీకాకుళం వైసీపీలో కూడా ధ‌ర్మాన‌కు మిగిలిన నాయ‌కుల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు.

ఇక వీరిద్ద‌రు త‌మ జిల్లాల్లో పార్టీ ప‌టిష్ట‌త కోసం ఎంత ఫైట్ చేస్తున్నా గ‌తంలో వీరి చేసిన అవినీతి అక్ర‌మాలు గుర్తుకు వ‌చ్చిన జిల్లా జ‌నాలు వీరిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.  2014 ఎన్నికలు అయిపోయి దాదాపు మూడున్నర ఏళ్ళు గడిచినా ఉత్తరాంధ్ర లో పార్టీ పరిస్థితి వీసమెత్తు కూడా మారలేదని సర్వేల్లో తేలిందట. అందుకు ప్రధాన కారణం బొత్స, ధర్మాన అంటూ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో జగన్ ఆలోచనలో పడ్డార‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల వీరిద్ద‌రిని పిలిచిన జ‌గ‌న్ ఓ ప‌రీక్ష పెట్టార‌ట‌. ఆరు నెల‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ప‌రిస్థితి మెరుగుప‌డాల‌ని… అందుకు మీరిద్ద‌రు బాధ్య‌త తీసుకోవాల‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌. లేనిప‌క్షంలో పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండ‌ద‌ని జ‌గ‌న్ తేల్చేశార‌ట‌. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రు అధం పాతాళంలో ఉన్న వైసీపీని ఎలా బ‌లోపేతం చేయాలా ? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.