జ‌గ‌న్ మంత్రంతో టీడీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి

October 12, 2018 at 12:39 pm

అవును! మార్పు మంచిదే! వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగం, మార్చిన ఈక్వేష‌న్ కూడా పార్టీకి మేలు చేస్తుంది!- అంటున్నారు పార్టీలోని సీనియ‌ర్లు. గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అనుచ‌రుడుగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఈయ‌న వైసీపీ ప్రారంభం నుంచి కూడా పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. వైసీపీ టికెట్ సంపాయించుకుని గెలిచి తీరాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గడిచిన నాలుగున్న‌రేళ్లుగా కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు. కేడ‌ర్‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగారు.

ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతూ.. పార్టీ నేత‌ల‌లో అసంతృప్తి అనేది లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఇక్క‌డ స‌డెన్‌గా జ‌గ‌న్ అభ్య‌ర్థిని మార్చారు. ఈ మార్పుతో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత క్లిష్టంగాను, ఇంపార్టెంట్‌గాను మార‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర‌త్రా ప‌రంగా మ‌రింత బ‌ల‌మైన వ్య‌క్తిని రంగంలోకి దింపాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు ఈ క్ర‌మంలోనే అప్పిరెడ్డిని త‌ప్పించి, విశ్రాంత పోలీస్ అధికారి చంద్ర‌గిరి ఏసుర‌త్నంను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. అయితే, ఈ మార్పుపై తొలుత ఇక్క‌డ ఆందోళ‌న, ఆవేద‌న వ్య‌క్త‌మైనా.. ఇప్పుడు మాత్రం జ‌గ‌న్ చేసిన మార్పును ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో అసలు మార్పు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? జ‌గ‌న్ చేసిన మ్యాజిక్ ఏంటి? ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నారు? అనే విష‌యాల‌పై వైసీపీలోను, ప్ర‌ధానంగా అధికార పార్టీ టీడీపీలోను చ‌ర్చ‌కు వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు వెస్ట్‌లో ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త నాయ‌కుడిని, మార్పును కోరుకుంటున్నారు. పైగా ఇక్క‌డ ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గం నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషిస్తున్నారు. బీసీ, రెడ్డి సామాజిక వ‌ర్గాలు కూడా బ‌లంగానే ఉన్నాయి. అయితే, చంద్ర‌గిరి ఏసుర‌త్నం వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. పైగా ఆయ‌న క‌న్వ‌ర్ట్ క్ట్రీస్టియ‌న్‌. దీంతో అటు బీసీలు, ఇటు ఎస్సీ, ఎస్టీలు కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశంమెండుగానే ఉంది. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గం ఎలాగూ జ‌గ‌న్ వెంటే ఉంటుంది కాబ‌ట్టి.. దీనికి ఎలాంటి ఢోకాలేదు. ఈ ఓట్లు స‌హ‌జంగానే వైసీపీకి వ‌స్తాయి. నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్లు ఎటూ టీడీపీ వైపే మొగ్గు చూపుతారు. బీసీల్లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మెజార్టీ వ‌ర్గాలు టీడీపీ వైపు చూపుతున్నాయి.

అయితే జ‌గ‌న్ జిల్లాలో బీసీ కార్డుతో టీడీపీ ఓటు బ్యాంకును కొల్ల‌గొట్టేందుకు అదిరిపోయే ఎత్తుగ‌డ వేశారు. చిల‌క‌లూరిపేట‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ, గుంటూరు వెస్ట్‌లో ఏసుర‌త్నం, రేప‌ల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌తో పాటు మంగ‌ళ‌గిరి సీటు సైతం బీసీల‌కు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు. అదే జ‌రిగితే జిల్లాలో ఏకంగా నాలుగు సీట్లు బీసీల‌కు ఇచ్చిన‌ట్ల‌వుతుంది. జ‌గ‌న్ వేసిన ఈ కొత్త ప్లాన్‌తో టీడీపీ గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఇక గుంటూరు వెస్ట్‌లో బీసీ, మైనార్టీ, రెడ్డి, క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకుతో ఇక్క‌డ ఏసుర‌త్నంకు మంచి ఛాన్సులు ఉన్నాయి. అలాగే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డిచిన నాలుగు ద‌శాబ్దాల ఎన్నిక‌ల్లోను ఒక్క చేబ్రోలు హ‌నుమయ్య‌, 1980-1989ల‌లో కాంగ్రెస్ నుంచి జ‌య‌రాం బాబు మాత్రమే రెండు సార్లు గెలిచారు.

ఇక్క‌డ ప్ర‌తిసారీ.. కొత్త నాయ‌కుడే ఇక్క‌డ విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మ‌రో విశేషం కూడా ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలోని నాయ‌కులే వీరికి అవ‌స‌రం లేదు. కొత్త‌వారైతే.. నాన్‌లోక‌ల్ అయినా స‌రే జైకొట్ట‌డం అల‌వాటు. ఈ క్ర‌మంలోనే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వంటి వారు కూడా ఇక్కడ విజ‌యం సాదించి ఎమ్మెల్యేల‌య్యారు. అభ్య‌ర్తి మంచి వ్య‌క్తి, సేవ‌కుడు అయితే చాలు.. కొత్తవారైన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి వారు జైకొట్టారు. ఈ నేప‌థ్యంలోనే అన్నీ ఆలోచించుకునే జ‌గ‌న్ ఏసుర‌త్నానికి జైకొట్టారు. ఈయ‌న వ‌ల్ల టీడీపీకి బ‌ల‌మైన బీసీ ఓట్లు చీలి.. ఏసుర‌త్నానికి ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. జ‌గ‌న్ ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా బీసీ కార్డు వాడ‌డంతో టీడీపీ త‌ల ప‌ట్టుకుంటోంది. మొత్తానికి జ‌గ‌న్ చేసిన మ్యాజిక్ అటు టీడీపీకి చెమ‌ట‌లు ప‌ట్టించ‌డంతోపాటు వైసీపీకి మేలు చేస్తుంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ మంత్రంతో టీడీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share