మ‌రో అద్భుత‌ ర‌త్నం మ‌రిచిపోయిన జ‌గ‌న్‌

`ప్ర‌త్యేక హోదా కోసం చివ‌రి వ‌ర‌కూ పోరాడ‌తాం, ఎంపీల‌తో రాజీనామా చేస్తాం. కేంద్రం మెడ‌లు వంచైనా హోదా సాధిస్తాం` అంటూ ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి.. త‌ర్వాత దానిని తుంగ‌లో తొక్కిన బీజేపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయ‌న ప‌దేప‌దే ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడ ప్లీన‌రీ వేదిక‌గా ప్రజ‌ల‌కు అన్ని హామీలు ఇచ్చిన వైసీపీ అధినేత‌.. ఇప్పుడు హోదా అంశాన్ని ప‌క్క‌న పెట్టేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా న‌వ ప‌థ‌కాలు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. ప‌దో హామీగా హోదాను కూడా పెట్టి ఉంటే.. బాగుండేద‌ని, మంచి అవ‌కాశాన్ని జ‌గ‌న్ మిస్స‌య్యార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

2019 ఎన్నిక‌ల‌కు సంబంధించిన మేనిఫెస్టోను ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గన్ రెండేళ్ల‌ల ముందుగానే ప్ర‌క‌టించేశారు. ఇక ఆ పార్టీ నేత‌లు టీడీపీ అధినేత అవినీతి, అక్ర‌మాలపైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టారు. అయితే ఈ ప్ర‌సంగాల్లో ఎవ‌రూ హోదా గురించి పట్టించుకోక‌పోవ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. హామీల అమ‌లులో రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్నే ఎండ‌గ‌ట్టారు త‌ప్ప‌, కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల గురించి ఎక్క‌డా త‌ప్పుబ‌ట్టేలా మాట్లాడ‌లేదు! ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా గురించి కూడా గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోయారు! అయితే మ‌రి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌బోతున్నారో చెప్పిన నేత‌లు.. హోదాపైనా మాట్లాడి ఉంటే బాగుంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కూ వైకాపా పోరాటం చేస్తుంద‌నీ, అవ‌స‌ర‌మైతే ఎంపీలు రాజీనామాలు చేసేందుకు కూడా వెన‌కాడ‌రని జ‌గ‌న్ త‌రచూ చెబుతున్న‌మాటే. అంతేకాదు, అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని కూడా ఈ మ‌ధ్య చెబుతూ వ‌చ్చారు. అయితే ప్ర‌ధాన‌మంత్రితో జ‌గ‌న్ భేటీ, రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో న‌యా దోస్తీ ఈ పరిణామాలన్నీ క‌లిసి ప్లీన‌రీలో హోదాపై గ‌ట్టిగా మాట్లాడ‌కుండా చేశాయ‌ని విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు. జ‌గ‌న్ గొప్ప‌గా చెప్పిన ఆ తొమ్మిది హామీల్లో ప్ర‌త్యేక హోదా ఎక్క‌డుందని, నామ్ కే వాస్తే అన్న‌ట్టుగా ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడినా… ఆ హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేక‌పోయార‌నే విమ‌ర్శించారు.

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించి.. తీరా స‌మ‌యం దొరికినప్పుడు ఇలా వెన‌క‌డుగు వేయ‌టమేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మోదీతో భేటీ అనంతరం ప్ర‌జ‌ల్లో బీజేపీ దోస్తీపై కొన్ని సంకేతాలు వెళ్లాయ‌ని, అయితే ఇప్పుడ ప‌దో హామీగా హోదాని పెట్టి ఉంటే.. హోదా ఇవ్వ‌ని టీడీపీ, బీజేపీపై ఆగ్ర‌హం ఉన్న‌వారంతా.. వైసీపీ వైపు మొగ్గుచూపే అవ‌కాశముంద‌ని వివ‌రిస్తున్నారు. అప్పుడు వైసీపీ బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ అవ‌కాశాన్ని జ‌గ‌న్ మిస్ చేసుకున్నార‌న‌డంలో సందేహం లేదు.