జ‌గ‌న్ కోర్టులోకి కొత్త గొడవ..ఎలా చెక్ పెడ‌తాడో…!

May 11, 2018 at 1:13 pm
ys jagan- kurnool

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ నాలుగేళ్లుగా స్త‌బ్దుగా ఉన్న నేత‌లంద‌రూ త‌లోపార్టీ వెతుక్కుంటున్నారు. టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తుండ‌టంతో వైసీపీ వైపు మొగ్గుచూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌లో ఈ నేత‌లంద‌రూ పార్టీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. దీంతో వైసీపీ బ‌లం పెరుగుతోంద‌ని భావిస్తున్నా.. అధినేత‌కు కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో.. వ‌ల‌స నేత‌ల కార‌ణంగా క్యాడ‌ర్‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. వ‌ల‌స నేత‌లు కూడా అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారని సంకేతాలు లీక‌వ‌డంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కంగారు మొద‌లైంద‌ట‌. ఎన్నిక‌లకు ఏడాది మాత్ర‌మే ఉన్న స‌మ‌యంలో.. ఇవి జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారే ప్ర‌మాదముందని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వీటికి ఎలా చెక్ పెడ‌తాడోన‌ని వేచిచూస్తున్నారు.  

 

నేత‌ల వ‌ల‌స‌ల‌తో వైసీపీకి కొత్త జీవం వ‌స్తోంది. ఇప్ప‌టికే కొంత‌మంది సీనియ‌ర్లు, జూనియ‌ర్లు పార్టీలో చేర‌గా.. మ‌రికొంద‌రు ఇదే బాట‌లో ఉన్నార‌ని వైసీపీ నేత‌లు స్ప‌ష్టంచేస్తున్నారు. ఇది నేతల్లో జోష్ నింపుతున్నా.. టికెట్ల కేటాయింపులకు వ‌చ్చే సరికి ఆనందం ఆవిరి అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయా నేత‌ల రాక‌తో.. అప్ప‌టివ‌ర‌కూ టికెట్ త‌మ‌దేన‌ని ఆశ‌లు పెట్టుకున్న వారిలో టెన్ష‌న్ మొద‌లైంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా పాణ్యంలో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మొన్నటి వరకు బీజేపీలో ఉన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు పాణ్యం అసెంబ్లీ టికెట్‌ ఎవరికి దక్కుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. 

 

పాణ్యం సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌరు చరితా వెంకటరెడ్డి, కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి మధ్య రసవత్తరపోరు నడుస్తోంది. సీనియర్‌ నాయకుడైన కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి చేరికతో తమ పార్టీ బలం ఆమాంతంగా పెరిగిందని జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు సంబరపడుతున్నా.. ఇప్ప‌టికే టికెట్‌ రగడ మొదలయ్యింది. ఇటీవల గౌరు వెంకటరెడ్డి దంపతులు పాణ్యం నియోజకవర్గ మండలాల్లో బూత్‌ లెవల్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పోటీ విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుంచి తానే పోటీ చేస్తానని గౌరు చరితా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనకే టికెట్‌ ఇస్తారని హామీ ఇచ్చారన్నారు. కాటసాని వర్గీయులు మాత్రం కొండంత ధీమాతో ఉన్నారు. సర్వే రిపోర్టులు కాటసాని పక్షానే ఉన్నాయంటున్నారు. 

 

తెలుగుదేశంపార్టీ నుంచి ఎవరు నిలబడినా కాటసాని గెలవడం నల్లేరు మీద బండి నడకేనని పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు. పాణ్యం అసెంబ్లీ టికెట్‌ విషయమై పార్టీ అధినేత జగన్‌ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎవరికీ మాట ఇవ్వకపోయినా ఇద్దరూ నేతలు మాత్రం కార్యకర్తల దగ్గర చర్చలు జరుపుతున్నారు. దీంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ క్యాడర్‌లో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇదే విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు కొందరు జిల్లా నేతలు! టికెట్‌ వార్‌కు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని జగన్‌ను కోరార‌ట‌. జగన్‌ కూడా వీలైనంత త్వరగా ఈ గొడవకు పుల్‌స్టాప్‌ పెట్టాలనే యోచనలో ఉన్నారట! మ‌రి ఈ వార్‌కు జ‌గ‌న్ ఎలాంటి ముగింపు ఇస్తారో వేచిచూడాల్సిందే!!

జ‌గ‌న్ కోర్టులోకి కొత్త గొడవ..ఎలా చెక్ పెడ‌తాడో…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share