
ఆలోచన ఉండాలే కానీ, ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించేయొచ్చని నిరూపిస్తున్నాడు వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్. ప్రస్తుతం ఆయన 2019 ఎన్నికలే టార్గెట్‌గా ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు నెల రోజులకు పైగా యాత్ర నిర్వహణ విజయవంతంగా సాగుతోంది. ఎక్కడికక్కడ జనాలు నీరాజనాలు పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారూ జగన్‌ను కలుస్తున్నారు. వారి సమస్యలు చెప్పుకొంటున్నారు. పరిష్కరించాలంటూ వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు.
మరి ఇంతలా సాగుతున్న కార్యక్రమానికి ఘనత వహించిన తెలుగు మీడియా కవరేజ్ ఇస్తోందా? అంటే నానాటికీ తీసికట్టు నాగం బొట్టు తరహాలోనే మీడియా వ్యవహరిస్తోంది. జగన్ ఈ పాదయాత్రల సందర్భంగా ఏమైనా టంగ్ స్లిప్ అయితే, దానిని హైలెట్ చేసి బద్నాం చేయాలని వేచి చూస్తోందే తప్ప ఈ పాదయాత్రను కవర్ చేయడం వల్ల జగన్‌కు ప్లస్‌లు పడిపోతాయేమనని తెగ ఫీలైపోతోంది. అదేసమయంలో ఈ పాదయాత్రను హైలెట్ చేయొద్దని సీఎం ,టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుకూల మీడియాకు ఇప్పటికే తెరవెనుక ఆదేశాలు జారీ చేశాడు కూడా. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రను పట్టించుకుంటున్న మీడియా సంస్థ ఏదీలేదు. ఒక్కసాక్షి తప్ప ఏ టీవీ కూడా లైవ్‌లో ప్రసారం చేయడమే లేదు.
దీంతో జగన్ ఎక్కడ పాదయాత్ర చేస్తున్నాడు, ఇప్పటికి ఎంత దూరం నడిచాడు. ఎలా సాగుతోంది ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదు. నిజానికి ఇలాంటిదేదో ఉంటుందని ఊహించిన జగన్.. పాదయాత్రకు ముందు మీడియా అధినేతలతో సమావేశమై తన ప్రచారం ప్రముఖంగా వచ్చేలా చూడాలని కోరినా ఫలితం లేకపోయింది. దాంతో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రంగంలోకి దిగారు. ఒక్క క్లిక్ చేరువలో జగన్‌ను జనాలకు చేరువ చేశాడు. సోషల్ మీడియా లో స్పీడ్ గా వుండే ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్ వంటి వేదికల్లో మార్కెటింగ్ స్ట్రేటజీతో వైసీపీ ప్రచారం హోరెత్తేలా చేయనున్నారు.
వీడియో లు ఫోటో లు వార్తలు జగన్ పాదయాత్ర విశేషాలను అన్ని కోణాల్లో కవర్ చేస్తూ క్షణ కణం అప్ డేట్స్ వచ్చేలా వైసిపి పార్టీ ప్లాన్ చేసింది. నెటిజెన్స్ లో చిన్నారులనుంచి 45 ఏళ్ళ వారి వరకు సోషల్ మీడియా లో చురుగ్గా వుంటున్నారు. ఫోర్ జి టెక్నాలజీ అందిరావడంతో గ్రామీణులు సైతం వెబ్ దునియాలో మునిగితేలుతున్నారు. పత్రికలు టివి వార్తలు సైతం అందులో వస్తేనే చూసే పరిస్థితి వచ్చేసింది. మొత్తంగా చూసుకుంటే సాధారణ మీడియా కన్నా సోషల్ మీడియా ద్వారా జగన్‌ను చేరువ చేయాలని భావిస్తున్న పీకే ఆలోచన అదిరోపోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.