జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై అంతా మౌనం.. ఏం జ‌రుగుతోంది!!

November 18, 2017 at 2:48 pm
jagan-TJ

అప‌ర చాణ‌క్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీసీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లిస్తోందా?  వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర తాలూకు చ‌ర్చ దాదాపు స‌మ‌సి పోయిందా? ఇక‌, జ‌గ‌న్ ఎంత గొంతు చించుకున్నా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం క‌ష్ట‌మేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌డిచిన నాలుగు రోజులుగా జ‌గ‌న్ పాద‌యాత్ర వ్య‌వ‌హారం దాదాపు తెర‌మరుగై పోయింది. ప్ర‌జ‌ల్లోనూ దీనిపై చ‌ర్చ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా తెలుగు మీడియాలో ఒక్క సాక్షి(జ‌గ‌న్ ది కాబ‌ట్టి) త‌ప్ప జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను క‌వ‌ర్ చేస్తున్న మీడియా కానీ, పేప‌ర్ కానీ క‌నిపించ‌డం లేదు. క‌నీసం జ‌గ‌న్ ఎన్నో రోజు పాద‌యాత్ర చేస్తున్నాడు. ఎక్క‌డ చేస్తున్నాడు? వ‌ంటి విష‌యాలూ పెద్దగా ప్ర‌చారంలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

దీంతో ఇప్పుడు అతి కొద్ది మంది మాత్రం వైసీపీయేత‌ర నేత‌లు, మీడియా ప్ర‌ముఖులు జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై దృష్టి పెట్టారు. మ‌రి ఒక్క‌సారిగా ఎందుకు ఇలా జ‌రిగింది? జ‌గ‌న్ ఒక్క‌సారిగా తెర‌చాటుకు ఎందుకు వెళ్లిపోతున్నారు? జ‌గ‌న్ విష‌యాలు ముఖ్యంగా పాజిటివ్ విష‌యాలు ఎందుకు క‌నిపించ‌డం లేదు? అనే సందేహాలు స‌హజంగానే పుట్టుకొస్తున్నాయి. దీనికి ఇప్పుడు బాబు వ్యూహం అని చెప్ప‌క త‌ప్ప‌దు. నిజానికి జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర అంత ఆషామాషీ కాదు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆయ‌న దీనిని భావిస్తున్నారు. ఎక్క‌డా అవాంఛ‌నీయ ప‌దాలు దొర్ల‌కుండా ప్ర‌సంగాలు సాగిస్తున్నారు. 

దీనికితోడు ఆయ‌న ఎక్క‌డ ఏ గ్రామంలోకి అడుగు పెట్టినా ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. ఆయా విష‌యాల‌ను మీడియా మొద‌టి నాలుగు రోజులు భారీ ఎత్తున క‌వ‌ర్ చేసింది. ఫ‌స్ట్ పేజీల్లో క‌ర్ట‌న్ రైజ‌ర్ ఐటంలు గా కూడా ఇచ్చింది. జ‌గ‌న్ చెప్పిన ప్ర‌తి మాట‌ను అక్ష‌రం మార్చ‌కుండా ప్ర‌చురించారు. ప్ర‌సారం చేశారు. ఫ‌లితంగా నిత్యం జ‌గ‌న్ వార్త‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. జ‌గ‌న్ ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నాడ‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. అంతేకాదు, జ‌గ‌న్‌కు ఆరోగ్యం బాగోలేద‌ని, న‌డుం నొప్పితో ఉన్నా బెల్ట్ పెట్టుకుని మ‌రీ ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

ఈ ప‌రిణామం టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు రుచించ‌లేదు. అలాగ‌ని జ‌గ‌న్‌ను తిట్టిపోసే అవ‌కాశం కూడా క‌నిపించ‌లేదు. దీంతో ఆయ‌న ఈ పాద‌యాత్ర త‌న కొంప ముంచ‌కుండా ఉండేందుకు చ‌క్క‌టి ప్లాన్ రెడీ చేశారు. ఈ పాద‌యాత్ర‌కు ప్ర‌చారం క‌ల్పించ కుండా చేయ‌డం ద్వారా జ‌గ‌న్ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా ఆయ‌న అసెంబ్లీ సాక్షిగా త‌న టీడీపీ నేత‌లు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ గురించి ఎక్క‌డా కామెంట్లు చేయ‌డం కానీ, ఆయ‌న పాద‌యాత్ర‌పై స్పందించ‌డం కానీ చేయొద్ద‌ని ఆదేశించారు. ఇవే ఆదేశాల‌ను మీడియా హౌజ్‌(త‌న‌కు అనుకూలంగా ఉన్న వాటికి) పంపిన‌ట్టు స‌మాచారం.  

అంతే.. ఇక‌, అప్ప‌టి నుంచి జ‌గ‌న్ వార్త‌లు ప్ర‌సారాల‌కు నోచుకోక‌పోవ‌డ‌మే కాకుండా.. ప్ర‌చురించ‌డంలోనూ పూర్తి వివ‌క్ష క‌నిపిస్తోంది. ఫ‌లితంగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ఇప్పుడు ఎక్క‌డా చ‌ర్చ న‌డ‌వ‌డం లేదు. అంతేకాదు, చంద్ర‌బాబు వ్యూహంలో మ‌రో కోణం.. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌చారం ప్రారంభించారు. విశాఖ‌లో అంత‌ర్జాతీయ అగ్రి స‌ద‌స్సు జ‌రిగింది. వాస్త‌వానికి దీనివ‌ల్ల సామాన్య పౌరుల‌కు ల‌బ్ధి లేదు. కేవ‌లం రైతుల‌కు సంబంధించింది. అయినా కూడా బాబు మాత్రం దీనిని పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి తెచ్చారు. ఫ‌లితంగా జ‌గ‌న్ వార్త‌ల‌కు చోటు లేని ప‌రిస్థితిని క‌ల్పించారు. సో.. రాజ‌కీయ అప‌ర‌చాణిక్యుడు వేసిన పాచిక ఫ‌లితాలను ఇస్తోంద‌ని, జ‌గ‌న్ పాద‌యాత్ర అస‌లు ఇప్పుడు ఎక్క‌డ జ‌రుగుతోందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని టీడీపీ నేత‌లు అంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఎలా వ్యూహం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి! 

జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై అంతా మౌనం.. ఏం జ‌రుగుతోంది!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share