టెక్క‌లిలో వైసీపీ మూడు ముక్క‌లాట‌..అచ్చ‌న్నాయుడికి జ‌గ‌న్ ఎర్త్‌!

September 16, 2017 at 6:46 am
acam naidu and ys jagan

నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో త‌గిలిన దెబ్బ‌ల నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్ కోలుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాటి వైఫ‌ల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ప‌దునైన వ్యూహంతో 2019పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న‌పై విమ‌ర్శ‌ల‌తో ఎడా పెడా నోరు పారేసుకుంటున్న అధికార ప‌క్షానికి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని లోట‌స్‌పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి త‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న మంత్రి అచ్చ‌న్నాయుడిపై జ‌గ‌న్ అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు బ‌హిరంగ స‌భ‌ల్లోనూ అచ్చ‌న్న జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్యేల‌తో ట‌చ్‌లో ఉంటూ.. పార్టీ ఫిరాయింపుల‌ను కూడా ప్రోత్స‌హిస్తున్నాడు. 

ఈ క్ర‌మంలో అచ్చ‌న్న‌కు షాకివ్వాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీనికిగాను  జ‌గ‌న్ మూడుముక్క‌లాట ఆడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్క‌లిలో త‌న‌కు తిరుగులేద‌ని అచ్చ‌న్న భావిస్తున్నారు. ఇక్క‌డే ఆయ‌న‌కు ఎర్త్ పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో డిపాజిట్లు గ‌ల్లంతయ్యేలా చ‌క్రం తిప్పాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచి వ్యూహానికి సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలో 2014లో టెక్కలి నుంచి వైసీపీ త‌ర‌ఫున  పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్, ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం కో-ఆర్డినేటర్‌గా ఉన్న‌ తిలక్‌, త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కిల్లి కృపారాణిల‌ను జ‌గ‌న్  అచ్చ‌న్న‌పై వ‌ద‌లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. 

వాస్త‌వానికి టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కిల్లి కృపారాణి కుటుంబానికి కూడా మంచి పేరుంది. అదేవిధంగా ప్ర‌జ‌ల్లో మంచి పట్టుంది. అదేవిధంగా తిల‌క్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్ర‌మంలో ఈ ముగ్గురినీ నియోజ‌క‌వ‌ర్గంలో బాగా తిప్పి.. అచ్చ‌న్న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయించాల‌ని జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేశారు. ఈ ముగ్గురూ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న వారే. అయితే, ఇక్క‌డ కృపారాణికి కేటాయించ‌డం ద్వారా మ‌హిళా సెంటిమెంట్‌తో పాటు అనుభ‌వానికి పెద్ద‌పీట వేసిన ఘ‌న‌తా వ‌స్తుంద‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. ఆదిశ‌గా పావులు క‌దుపుతున్నారు. 

మిగిలిన ఇద్ద‌రికీ ఎమ్మెల్సీ ఇవ్వ‌డం ద్వారా వారిని బుజ్జ‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. దీంతో వీరంతా నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు బిగించి అచ్చ‌న్న‌కు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. రెచ్చిపోతున్న అచ్చెన్నను వచ్చే ఎన్నికల్లో ఓడించడం ద్వారా అటు టీడీపీ హ‌వాకు కూడా చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మొత్తం మీద తనకు వ్యతిరేకంగా మాట్లాడే మంత్రులకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాల‌ని  జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

టెక్క‌లిలో వైసీపీ మూడు ముక్క‌లాట‌..అచ్చ‌న్నాయుడికి జ‌గ‌న్ ఎర్త్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share