నంద్యాల గుణ‌పాఠం..  జ‌గ‌న్ మారాల్సిందే! 

రాజ‌కీయం అంటేనే ఉగాది ప‌చ్చ‌డి! తీపి, చేదు క‌ల‌యిక‌ల మేళ‌వింపు! నంద్యాల‌లో హోరా హోరీ త‌ల‌ప‌డిన టీడీపీ, వైసీపీల‌దీ ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి. ఒక‌రు తీపిని ఆస్వాదిస్తుంటే.. మ‌రొక‌రు చేదు గుళిక మింగ‌క త‌ప్ప‌ని స్థితి. ఏ ఎన్నికైనా.. ఎంత మంది బ‌రిలో ఉన్నా.. గెలుపు ఒక్క‌రినే వ‌రిస్తుంది! అదే ఇప్పుడు జ‌రిగింది. అయితే, ఈ ఎన్నిక‌, ప్ర‌జా తీర్పు.. ఒక్క గెలుపు ఓట‌మికే ప‌రిమితం కాలేదు. ఓ వ్య‌క్తికి అధికారం అప్ప‌గించేసి చేతులు ముడుచుకోలేదు. నంద్యాల ప్ర‌జ‌లు ఈ ఎన్నిక ద్వారా అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు. మేధావులు పైకి చెప్పే అనేక అంశాల‌ను నంద్యాల ప్ర‌జ‌లు మౌనంగా త‌మ ఓటు ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు.

ఈ తీర్పు.. అనేక మార్పుల‌ను సూచిస్తోంది. వీటిలో ప్ర‌ధాన‌మైంది జ‌గ‌న్ మారాలి!! జ‌నం మ‌ద్ద‌తు కావాలంటే.. జ‌నాన్ని ప‌రిపాలించాలంటే.. జ‌గ‌న్ మారాలి!! ఇదీ సుస్ప‌ష్టంగా నంద్యాల ప్ర‌జ‌లిచ్చిన ప్ర‌ధాన తీర్పు. నంద్యాల ఎన్నిక‌ను జ‌గ‌న్‌.. త‌న‌దిగా భావించారు. త‌న‌కు, బాబుకు జ‌రుగుతున్న యుద్ధంగా చిత్రీక‌రించారు. ఈ క్ర‌మంలోనే “రాజ‌కీయాలన్నాక ఎంతో ఓర్పుండాలి చంద్ర‌బాబూ.. “- అని ఉమ్మ‌డి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా.. జ‌గ‌న్ తండ్రి సీఎం హోదాలో వైఎస్ అన్న మాట‌ల‌ను జ‌గ‌న్ మ‌రిచిపోయారు. ఓర్పును ప‌క్క‌న పెట్టి ఆవేశం అనే ఆయుధాన్ని ప‌దునెక్కించారు. జ‌నాల్లో సింప‌తీ సంపాయించుకున్న చంద్ర‌బాబుపై ఒంటి కాలిపై విరుచుకుప‌డ్డారు.

కాల్చేయాలి… ఉరేయాలి.. బ‌ట్ట‌లూడ‌దీయాలి.. చెప్పుల‌తో కొట్టాలి.. వంటి అవ‌స‌రం లేని, అన‌వ‌స‌ర‌మైన వృధా వ్యాఖ్య‌ల‌తో న‌లుగురిలోనూ పలుచ‌న‌య్యారు జ‌గ‌న్‌. అంతేకాదు, ఈయ‌న‌కు ఇంత ఆవేశ‌మైతే.. రేపు మా ప‌రిస్థితి ఏంటి అని జ‌నాలు చ‌ర్చించుకునే స్థాయికి వ‌చ్చేలా ప్ర‌వ‌ర్తించారు. జ‌నాలు దేన్న‌యినా స‌హిస్తారు.. కానీ, ఆవేశాన్ని, ఆవేశ ప‌రుడునీ ఎన్న‌టికీ స‌హించ‌లేరు. ఇప్పుడు నంద్యాల‌లోనూ ఈ ఆవేశ‌మే.. జ‌గ‌న్‌కి అన‌ర్థం తెచ్చింది. ఈ ఆలోచ‌నా ర‌హిత వ్యాఖ్య‌లు, దుందుడుకు వ్య‌వ‌హార‌మే కొంప ముంచింది. అందుకే జ‌నాల తీర్పు ఇంత చేదుగా ఉంది!!

అయినా.. జ‌నాలు పూర్తిగా జ‌గ‌న్‌ని ప‌క్క‌న పెట్టారా? నిజంగానే జ‌గ‌న్‌ను వ్య‌తిరేకిస్తున్నారా? పూర్తిగా బాబునే నెత్తిన పెట్టుకున్నారా? బాబును మించిన వారు లేర‌ని భావిస్తున్నారా? అంటే.. అస్స‌లు ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు తావేలేద‌ని కూడా నంద్యాల ఓట‌ర్లు సుస్ప‌ష్టం చేశారు. నిజంగా బాబునే న‌మ్మి ఉంటే.. నిజంగా జ‌గ‌న్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించి ఉంటే.. వైసీపీ అభ్య‌ర్థి ఇంత బ‌ల‌మైన పోటీ ఇచ్చేవాడు కాదేమో?! జ‌నాలు అలా అనుకోలేదు. జ‌గ‌న్ మారేందుకు ఓ ఛాన్స్.. అన్న‌ట్టుగా వారు ఓట్లేశారు. జ‌నాలు నిజ‌మైన తీర్పుతో జ‌గ‌న్‌ను లైన్‌లో పెట్టేందుకే ప్ర‌య‌త్నించార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఏదేమైనా.. నంద్యాల తీర్పు.. జ‌గ‌న్‌లో మార్పులు కోరుతున్న మాట నిజం!!