దూకుడు పెంచిన జ‌గ‌న్

March 13, 2019 at 12:43 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రింత దూకుడు పెంచారు. పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌రానికి పార్టీ శ్రేణుల‌ను స‌న్న‌ద్ధం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే స‌ర‌మ‌శంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ విజ‌య‌వంతంగా స‌భ‌లు పూర్తి చేసి, ముఖ్య‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేసిన జ‌గ‌న్‌.ఈనెల 16 నుంచి పార్టీ అభ్య‌ర్థుల తొలి జాబితాను ప్ర‌క‌టించి, ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎప్పటిక‌ప్పుడు పార్టీ శ్రేణుల్ని అప్ర‌మ‌త్తం చేస్తూనే ఎన్నిక‌ల స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొనేందుకు ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు వెళ్తున్నారు.

ఇప్ప‌టికే లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వైసీపీ త‌రుపున‌ పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది.మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని జ‌గ‌న్‌ నిర్ణయించినట్లు తెలిసింది. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే.. ఎన్నిక‌ల ప్ర‌చారంపై జ‌గ‌న్ దృష్టిసారించ‌నున్నారు. అభ్య‌ర్థులను వారివారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారానికి పంప‌డం.. ఆ త‌ర్వాత షెడ్యూల్ ఆధారంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని పార్టీ నేత‌లు అంటున్నారు.

ఈనెల 16 నుంచే జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్టే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని పార్టీ నేత‌లు అంటున్నారు. 13 జిల్లాల్లో జ‌గ‌న్ పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. జగన్‌ ఎన్నికల ప్ర‌చారం పెనుగొండ, గాజువాక లేదా గురజాలలో ఏదో ఒక చోట నుంచి ప్రారంభిస్తార‌ని.. ఈ మేర‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. బుధవారం నాడు ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. టీడీపీ నుంచి కీల‌క నేత‌లు వ‌చ్చి వైసీపీ తీర్థంపుచ్చుకుంటున్నారు. ఇక జ‌గ‌న్ ప్ర‌చారంతో వైసీపీ దూకుడు మ‌రింత పెరుగుతుంద‌ని పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

దూకుడు పెంచిన జ‌గ‌న్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share