
ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 115 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం గుంటూరులో ఉవ్వెత్తున సాగుతున్న ఈ పాదయాత్రకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. అంతాబాగానే ఉంది. అయితే, ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా టైం.. నడుస్తోంది. హోదా గురించి ఎవరు ఏం మాట్లాడినా, బీజేపీ, పవన్, టీడీపీపై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా ప్రజలు ఆసక్తిగా వింటున్నారు.
మరి ఈ సమయంలో జగన్ మరింతగా తన వాణిని వినిపించేందుకు ఢిల్లీలో ఓ రెండు రోజుల పాటు మకాం వేయాలని అంటున్నారు పరిశీలకు లు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆది నుంచి కూడా జగన్ ఒకే మాటపై ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సీఎంగా అధికారం చేతిలో పెట్టుకుని, కేంద్రంలోని ప్రబుత్వంతో చెలిమి చేస్తూ కూడా చంద్రబాబు మాత్రం ఇష్టాను సారంగా హోదాపై మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
కానీ, బాబుతో పోల్చుకుంటే జగన్ వెయ్యి రెట్లు బెటర్. హోదా ఇచ్చేది లేదని కేంద్రం, హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని రాష్ట్రం భీష్మించుకున్నప్పటికీ.. జగన్ మాత్రం హోదా ఎందుకు రాదో చూద్దాం అంటూ పౌరుషాగ్ని రగిలించారు. విద్యార్థులను, యువతను ఏకం చేశారు. వచ్చే ఎన్నికల్లో హోదా ఇస్తాననే పార్టీకి తాము మద్దతిస్తామని కూడా జగన్ ప్రకటించారు. మరో నాలుగు అడుగులు ముందుకు వేసి.. హోదా కోసం అవసరమైతే.. తాము తమ ఎంపీలతో రాజీనామాలు సైతం చేయిస్తానని జగన్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశాడు. అదేవిధంగా కేంద్రంపై అవిశ్వాసానికి కూడా వెనుకాడబోమన్నారు.
ఇలా మొదటి నుంచి కూడా జగన్.. ఏపీ విషయంలో తన స్టాండ్‌ను ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు ఇటు ఏపీలోనూ, అటు ఢిల్లీలోనూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. పార్ల మెంటులో ఎంపీలు కార్యక్రమాలను స్తంభింప జేస్తున్నారు. రాజ్యసభ, లోక్‌సభలు వరుస పెట్టి మరీ వాయిదా పడుతు న్నాయి. ఈ క్రమంలో జగన్ పాదయాత్రకు ఒకటి రెండు రోజులు విరామం ప్రకటించి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఏపీలో చంద్రబాబు వ్యవహరించిన తీరుతోనే ప్రత్యేక హోదా అంశం నాలుగేళ్లుగా అటకెక్కిందని, ప్యాకేజీకి ఒప్పుకునే అవకాశం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ? చంద్రబాబు మూలంగానే రాష్ట్రం అథోగతికి చేరుకుందని, విభజన చట్టాన్ని అమలు చేయించుకోలేని చంద్రబాబు అపర చాణిక్యుడు ఎలా అవుతాడని? జగన్ ఘాటుగా వ్యాఖ్యలు చేయాల్సిన సమయం ఇదే.
అయితే, ఈ వ్యాఖ్యలు ఆయన పాదయాత్రలో కాకుండా.. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాతో భేటీ అయి మాట్లాడితే.. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగానూ బాబును ఏకేసినట్టు ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా నాలుగేళ్లు పదవులు అనుభవించిన తర్వాతే బాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విషయాన్ని కూడా ప్రస్థావించాలని కోరుతున్నారు. మరి యువనేత ఏం చేస్తారో చూడాలి.