వైఎస్ వివేకానందరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం..

March 15, 2019 at 8:41 am

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో మృతి చెందారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ఏ విష‌యంలోనైనా దాగుడుమూత‌లు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తి వివేకానందరెడ్డి. అదే స‌మ‌యంలో సౌమ్యుడిగా ఆయ‌న‌ పేరు పొందారు. సామాజిక‌సేవ‌లోనూ ఆయ‌న ఎప్పుడూ ముందువ‌రుస‌లోనే ఉండేవార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న క‌డ‌ప జిల్లా పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు ఆయ‌న‌ చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు అండ‌గా ఉంటూ అజాత శ‌త్రువుగా గుర్తింపు పొందారు వివేకానంద‌రెడ్డి. ప్ర‌భుత్వంలో, పార్టీలో కూడా ఆయ‌న వివిధ హోదాల్లో ప‌ని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవ‌డంలో వివేకానంద‌రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపేవారు.

1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి కూడా ఆయ‌న ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక‌ 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా వివేకానంద‌రెడ్డి పనిచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబం, అభిమానుల్లో విషాదం నెల‌కొంది. విష‌యం తెలియ‌గానే ప‌లువురు ప్ర‌ముఖులు హుటాహుటిన ఆయ‌న నివాసానికి చేరుకుని నివాళుల‌ర్పిస్తున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share