జ‌గ‌న్ కోసం ఒక్క‌టైన తెర వెన‌క లీడ‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందా? 2019లో జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేర‌బోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న దివంగ‌త వైఎస్ మిత్రులు, స‌న్నిహితులు అంద‌రూ జ‌గ‌న్‌కి జ‌ట్టుగా క‌లిసి రావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వైఎస్ అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌తో ఎంతో చెలిమి చేసిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జ‌గ‌న్‌ని సీఎంని చేసే బాధ్య‌త తీసుకున్నార‌ని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్ర‌ధాన చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు.

వాస్త‌వానికి వైఎస్ మిత్రులు అంద‌రూ క‌ర‌డు గ‌ట్టిన కాంగ్రెస్ వాదులు. స‌బ్బం హ‌రి, కేవీపీ, ఉండ‌వ‌ల్లి, హ‌ర్ష కుమార్ వంటి వారు వైఎస్‌కి ఎంతో మిత్రులు . అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌కు వీర విధేయులు. అయిన‌ప్ప‌టికీ.. ఏపీలో ఇప్ప‌ట్లో కాంగ్రెస్ కోలుకోద‌ని గ్ర‌హించేసిన వీళ్లు.. జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా బాబును ఓడించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం దీనిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేత‌లంతా.. ప్రత్యక్షంగా వైసీపీలో చేరినా.. చేరకపోయినా.. జగన్‌కి మేలు జరిగేలా అడుగులు వేయాలని.. ఇటివలే రహస్యంగా జరిగిన ఓ సమావేశంలో అనుకున్నారట.

ఈ సమావేశంలోనే వై.ఎస్‌కి దగ్గరగా ఉండి జగన్‌కి దూరమైన వారిని దగ్గరికి తెచ్చేలా ఉండవల్లికి అప్పజెప్పారట కేవీపీ. తన రాజకీయ గురువుగా చెప్పుకునే కేవీపీ మాటని.. తూచా తప్పకుండా పాటిస్తూ ఉండవల్లి ఇప్పటికే రంగంలోకి దిగి పని కూడా మొద‌లు పెట్టార‌ని టాక్‌. ఇక‌, ప్ర‌ముఖ లాయ‌ర్ కూడా అయిన ఉండ‌వ‌ల్లి త‌న ప‌దునైన మాట‌ల‌తో అంద‌రినీ జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తుగా ఒప్పిస్తున్న‌ట్టు స‌మాచారం. స‌బ్బం హ‌రి, హ‌ర్ష కుమార్ వంటి నేతలు తూర్పు గోదావ‌రి జిల్లాల్లో గ‌ట్టి ప‌ట్టున్న నేత‌లు. ఇప్ప‌టికే ముద్ర‌గ‌డ లోపాయికారీగా జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వీరంతా ఒక‌టైతే.. జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయం అనే మాట వినిపిస్తోంది. నిజానికి వీరంద‌రికీ జ‌గ‌న్‌పై ప్రేమ కంటే.. బాబుపై వ్య‌తిరేక‌తే ఎక్కువ‌గా ఉంది. బాబుపై వ్య‌తిరేక‌త‌నే వారు జ‌గ‌న్‌పై ప్రేమ రూపంలో చూపించి, బాబును ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే, కాంగ్రెస్ ఉందిగా? అంటే.. ఇప్ప‌ట్లో అది కొలుకునే పరిస్థితి లేద‌ని నిర్ణ‌యించేసుకున్నారు. దీంతోనే జ‌గ‌న్ వ‌స్తే.. అటు త‌మ‌కు, ఇటు కాంగ్రెస్‌కి కూడా బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌. సో.. మ‌రి 2019 నాటికి జ‌గ‌న్ ను బ‌ల‌ప‌రిచేందుకు వైఎస్ మిత్ర బృందం ఒక్క‌టైతే.. బాబు ప‌ని మ‌టాషేనా? వేచి చూడాలి.