వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ మాటంటే లెక్కేలేదా..

September 13, 2017 at 8:30 am
YSRCP, YS Jagan, Leaders

ఒక్క విజ‌యం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అప‌జ‌యం.. రాజును బంటు క‌న్నా హీన‌మైన స్థితికి దిగ‌జార్జేస్తుంది. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత, లోట‌స్ పాండ్ వ‌ర్గాలు గౌర‌వంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జ‌గ‌న్ ప‌రిస్థితి బంటుక‌న్నా హీనంగా త‌యారైంద‌ని తెలుస్తోంది. 2014లో ఎదురైన ప‌రాభ‌వం ప‌క్క‌న పెడితే… ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్‌ల‌లో వైసీపీ ఘోరంగా నేల‌కు క‌రుచుకోవ‌డంతో జ‌గ‌న్ ఇమేజ్ జ‌నాల్లో క‌న్నా పార్టీ నేత‌ల్లో పూర్తిగా డ్యామేజ్ అయింద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మాట‌ను ఏ ఒక్క‌రూ ఖాత‌రు చేయ‌డం లేద‌ట‌.

దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. జ‌గ‌న్ ఎంత‌గానో మ‌రీ నొక్కిచెప్పిన న‌వ‌ర‌త్నాల‌ను స‌ద‌రు నేత‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌క పోవ‌డ‌మే! నంద్యాల ఉప పోరు క‌న్నా ముందు జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీలో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు పేరుతో 2019 ఎన్నిక‌ల్లో గెలిస్తే.. తాను చేయ‌బోయే కార్య‌క్ర‌మాల‌ను ఏక‌రువు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే వీటిని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేలా.. నేత‌ల‌కు దిశానిర్దేశం చేశాడు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ ప‌రిధిలో స‌భ‌లు నిర్వ‌హించి న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌చారం చేయాల‌ని నేత‌ల‌కు పిలుపుకూడా ఇచ్చారు. దీనికి ఈ నెల 11 వ‌ర‌కు గ‌డువు విధించాడు. అయితే, ఈ విష‌యంలో ఏ ఒక్క నేతా జ‌గ‌న్ ఆదేశాల‌ను పాటించ‌లేదు. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా న‌వ‌ర‌త్నాల స‌భ‌ను నిర్వ‌హించ‌లేదు.

దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్‌కి వైసీపీలో ఎంత డ్యామేజీ ఏర్ప‌డిందో తెలుస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, ఏయే ప్రాంతాల్లో ఎవ‌రెవ‌రి ప‌రిస్థితి ఎలా ఉందో చూద్దాం. కాకినాడ నియోజకవర్గంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముత్తా శశిల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇక్కడ నవరత్నాల సభను నిర్వహించలేదు. ఇద్దరి మధ్య సఖ్యత లేని కారణంగానే ఇప్పటి వరకూ సభను నిర్వహించలేదని తెలుస్తోంది.

+ మరికొందరు నేతలు సభలు, సమావేశాలతో ఇప్పటికే తాము ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని బహిరంగంగానే జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు.

+ పార్టీ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకుండా తాము సభలను ఎలా నిర్వహించగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు.

+ రాయలసీమలోని పత్తికొండ నియోజకవర్గంలో అక్కడి కో-ఆర్డినేటర్ లక్ష్మీ నారాయణ హత్య జరగడంతో ఆయన స్థానంలో భార్య శ్రీదేవిని నియమించారు. పత్తికొండలో ఇప్పటి వరకూ నవరత్నాల సభ జరగలేదు.

+ బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి కూడా సభను ఏర్పాటు చేయలేదు. ఈయన ఇటీవల నంద్యాలలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి మామ. మరి సభను ఎందుకు నిర్వహించలేదన్న దానిపై కాటసాని ఇంతవరకూ వివరణ కూడా ఇవ్వలేదు.

+ ఏలూరు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లోనూ నవరత్నాల సభలను ఏర్పాటు చేయలేదు.

+ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు ఇన్ ఛార్జులను నియమించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెబుతున్నారు. సో.. వైసీపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఇదీ..

 

వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ మాటంటే లెక్కేలేదా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share