2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ..!

ఏపీ విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తే తాను మంత్రి అవ్వ‌వ‌చ్చ‌ని ప్లాన్ వేస్తోన్న వైవీ ఈ క్ర‌మంలోనే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్న‌ట్టు ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు.

ఇక వ‌చ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్న ఆయ‌న మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంత్రి అవ్వాలంటే ఆయ‌న ముందుగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌వ్వాల్సిందే. ఎమ్మెల్సీగా కూడా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టే ఛాన్స్ ఉన్నా త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా మార‌తాయో అన్న సందేహంతో ఉన్న వైవీ ముందుగా ఎమ్మెల్యే సీటుపైనే క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయన జిల్లాలోని అద్దంకి నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి ర‌వికుమార్ టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు అద్దంకి వైసీపీ బాధ్య‌త‌ల‌ను మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గ‌ర‌ట‌య్య చూస్తున్నారు. తాజాగా వైసీపీ జిల్లా ప్లీన‌రిలో గ‌ర‌ట‌య్య కుమారుడు చైత‌న్య కూడా హ‌డావిడి చేశారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి నుంచి వైసీపీ త‌ర‌పున గ‌ర‌ట‌య్య లేదా ఆయ‌న కుమారుడు చైత‌న్య పోటీ చేస్తార‌నుకుంటోన్న టైంలో ఇప్పుడు హ‌ఠాత్తుగా ఆ నియోజ‌క‌వ‌ర్గం మీద సుబ్బారెడ్డి క‌న్ను ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

అద్దంకి టీడీపీలో ఇప్ప‌టికే గ్రూపుల గోల బాగా ఎక్కువుగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీలోకి వ‌స్తార‌ని మ‌రో టాక్ న‌డుస్తోంది. ఇక వైసీపీలో ఇప్ప‌టికే గ‌ర‌ట‌య్య ఉన్నారు. మ‌రి ఈ టైంలో సుబ్బారెడ్డి కన్ను కూడా ఇక్క‌డే ప‌డితే అద్దంకి వైసీపీలో గ్రూపుల గోల టీడీపీని మించిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.