ప‌వ‌న్ గురించి రోజా కొత్త భాష్యం! 

నంద్యాల ఉప ఎన్నిక‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పెరుగుతోంది. ఒక‌రిని మించి మ‌రొక‌రు మాట‌ల‌తో గేమ్ ఆడేస్తున్నారు. ఇక‌, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జ‌బ‌ర్డ‌స్త్ రోజా.. మ‌రింత‌గా రెచ్చిపోయింది. నంద్యాల‌లో గెలుపు వైసీపీదేన‌ని చెప్పింది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిపోయింద‌ని, అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలివిగా వ్య‌వ‌హ‌రించి.. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేద‌ని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ ప‌వ‌న్ ఎవ‌రికైనా మ‌ద్ద‌తిచ్చినా.. వైసీపీ గెలుపును ఎలాగూ ఆప‌లేరు కాబ‌ట్టి ఆయ‌న పూర్తిగా అవ‌మానం పాలుకావ‌డం త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌ని అన్నారు.

అందుకే ప‌వ‌న్ తెలివిగా త‌ప్పించుకున్నాడ‌ని రోజా చెప్పుకొచ్చారు. చంద్రబాబు బెదిరింపులకు నంద్యాల ఓటర్లు భయపడే పరిస్థితి లేదు. ఆయనకు నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని త‌న రోటీన్ డైలాగులతో చంద్ర‌బాబును ఏకేసింది రోజా. నిజానికి గెలుపు త‌న‌దేన‌ని, ఇక తాను నంద్యాల‌లో ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చిన బాబు.. ఇప్పుడు ఇక్క‌డ‌ పరిస్థితి మారే సరికి బట్టలు సర్దుకుని నంద్యాలలో మకాం వేసేందుకు వస్తున్నార‌ని ఎద్దేవా చేసింది. బాబు ప‌ర్య‌ట‌న అంతా కుట్ర‌లు, హ‌త్యా రాజ‌కీయాల చుట్టే తిరుగుతాయ‌ని చెప్పుకొచ్చింది.

అంతేకాదు, వైసీపీ గెలుస్తుంద‌ని తేలిపోవ‌డంతో.. ఈ నంద్యాల ఉప పోరును ఎలాగైనా స‌రేవాయిదా వేయించేందుకు బాబు అండ్ కో ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా రోజా దుయ్య‌బ‌ట్టింది. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని, రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబుకు బుద్ధి చెప్పే అవకాశం రావడం నంద్యాల ప్రజల అదృష్టం అని ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది రోజా. అంతేకాదు, ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం కూడా చేసింది రోజా.. సీమకు రావాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారని చెబుతూ.. సీమ వేరు, మంగ‌ళ‌గిరి వేరు అనే యాంగిల్‌లో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టింది.

చంద్ర‌బాబు సొంత‌ జిల్లా అయిన చిత్తూరులో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని మన్నవరం ప్రాజెక్ట్‌ కు నిధులు అందకుండా చేశారని విమ‌ర్శించింది. అలాగే రాయలసీమకు రావాల్సిన సెంట్రల్‌ వర్సిటీని మరిచిపోయారని, ఫాతిమా కాలేజీ విద్యార్థులు తమకు న్యాయం చేయడంటూ ఏడు, ఎనిమిది నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా వారిని పట్టించుకోని మైనార్టీ ద్రోహి చంద్రబాబేన‌ని ఇలా .. అవ‌కాశం ఉన్న ప్ర‌తి విష‌యాన్నీ త‌మకు అనుకూలంగా మార్చేసుకుంది రోజా. మొత్తానికి బాబును మైనార్టీ వ్య‌తిరేకిగా, సీమ ద్రోహిగా చిత్రించి నంద్యాల‌లో గెలిచేందుకు, జ‌గ‌న్ కంట్లో ప‌డేందుకు పెద్ద ప్ర‌య‌త్నమే చేసింది. మ‌రి నంద్యాల ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.