వైసీపీలో ముస‌లం…ఆ టాప్ లీడ‌ర్ల మ‌ధ్య యుద్ధం

July 14, 2018 at 11:04 am
ycp-

ఇద్ద‌రు బ‌డా నాయ‌కుల మ‌ధ్య మొద‌లైన ఆధిప‌త్య పోరు.. వైసీపీ క్యాడ‌ర్‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తోంది. ఎవ‌రికి వారు సొంతంగా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌టంతో పాటు ఎటువైపు వెళ్లాలో తెలియ‌క వీరంతా అయోమ‌యంలో ఉంటున్నారు. ఇటీవ‌ల పార్టీ త‌ర‌ఫున చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు.. బ‌ల‌నిరూప‌ణ‌కు ఉప‌యోగించుకుంటున్నారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరూ సీనియ‌ర్లే అని జిల్లాలో పార్టీ బాధ్య‌త‌లు వీరికి అప్ప‌గిస్తే.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఫ‌లితంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ముసలం రోజురోజుకూ తార‌స్థాయికి చేర‌డంతో అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు స‌రికొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తోంద‌ట‌. ఇద్ద‌రూ ఆర్థికంగా బ‌ల‌మైన నేత‌లే కావ‌డం, సీనియ‌ర్ నాయ‌కులు కావ‌డంతో ఎవ‌రికీ స‌ర్దిచెప్ప‌లేక జ‌గ‌న్ ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజ‌కీయాల్లో కోల‌గ‌ట్ల వ‌ర్సెస్ బొత్స వ‌ర్గాల మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరింది.

 

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్స స‌త్య‌నారాయ‌ణ, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మ‌ధ్య కోల్డ్ వార్ ముదిరి పాకాన ప‌డుతోంది. దీంతో జిల్లా వైసీపీ క్యాడ‌ర్‌లో ఆందోళ‌న నానాటికీ పెరుగుతోంది. ఇరు వ‌ర్గాలు ఏక‌తాటిపైకి వ‌చ్చేందుకు స‌సేమిరా అంటుండ‌టంతో పార్టీకి భ‌విష్య‌త్‌లో ఇబ్బందికర ప‌రిస్థితులు త‌ప్ప‌వేమోననే చ‌ర్చ మొద‌లైంది. పార్టీ ఇమేజ్ కంటే త‌మ వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకునేందుకు నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండటంతో తీవ్ర స్థాయికి చేరింది. కాంగ్రెస్ నుంచి కోల‌గ‌ట్ల జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. ఇక పార్టీకి అంతా తానే అని భావించినా.. త‌ర్వాత బొత్స చేరిక‌తో ఇది రివ‌ర్స్ అయిపోయింది. అప్పటివ‌ర‌కూ కాంగ్రెస్‌లోనూ ఇద్దరు నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ ఉన్నా.. అది చాప కింద నీరులా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బ‌హిర్గ‌త‌మ‌వుతోంది. ఒక‌రు ఎద‌గ‌కుండా మ‌రొక‌రు ఎప్ప‌టిక‌ప్పుడు కళ్లెం వేసుకుంటూ.. చివ‌ర‌కు పార్టీ అధినేతకు ఫిర్యాదుల వర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. 

 

దీంతో జ‌గ‌న్ క‌ల‌గ‌జేసుకుని ఇద్ద‌రూ విభేదాలు ప‌క్క‌న‌పెట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని న‌చ్చ‌జెప్పారు. అప్పుడు `అలాగే` అన్న నేత‌లు త‌ర్వాత ష‌రా మామూలుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌ద‌శ‌లో పార్టీకి కోల‌గ‌ట్ల దూరంగా ఉండ‌టం తో పాటు పార్టీ మార‌తారనే ప్ర‌చారం జోరందుకోవ‌డంతో కంగారు ప‌డిన జ‌గ‌న్‌.. స‌ర్దిచెప్ప‌డంతో కొంత వెన‌క్కి త‌గ్గారు. 

ఇటీవ‌ల వైఎస్ జ‌యంతి వేడుక‌ల‌ను కోల‌గ‌ట్ల వ‌ర్గం భారీస్థాయిలో నిర్వ‌హించింది. అంతేగాక జ‌గ‌న్ పాద‌యాత్ర 2500 కిలోమీట‌ర్లు పూర్త‌యిన సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు బొత్స వ‌ర్గం దూరంగా ఉండ‌టం వీరి మ‌ధ్య ఆధిపత్య పోరును బ‌హిర్గ‌తం చేసింది. దీనికి పోటీగా అంతేస్థాయిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది బొత్స వ‌ర్గం. ఇలా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను వేర్వేరుగా నిర్వ‌హించి.. పార్టీ క్యాడ‌ర్‌లో సందేహాలు రేకెత్తేలా చేస్తున్నారు. 

 

జిల్లాలో తొలి నుంచి పార్టీకి అండ‌గా ఉన్న అవ‌నాపు సోద‌రుల‌ను కోల‌గ‌ట్ల వ‌ర్గం ప‌క్క‌న పెట్టేయ‌డంతోనే తాము దూరంగా ఉంటున్నామ‌ని బొత్స వ‌ర్గం చెబుతోంది. అంతేగాక త‌మ కుటుంబ‌స‌భ్యుల‌ను రంగంలోకి దించేందుకు వీర‌భ‌ద్ర‌స్వామి ప్ర‌య‌త్నిస్తుండ‌టం కూడా మింగుడు ప‌డ‌టం లేద‌ట‌. వ‌చ్చే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న కూతురు, అల్లుడిని గానీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో కోల‌గ‌ట్ల ఉన్నార‌ట‌. దీంతో బొత్స వ‌ర్గం మ‌రింత ఆగ్ర‌హానికి గుర‌వుతోంద‌ట‌. ఫ‌లితంగా ఎవ‌రికి వారు ఇలా సొంత ఎజెండాతో పార్టీ జెండాను ప‌క్క‌న పెట్టేసి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం ఆందోళ‌న చెందుతోంది. గ్రూపు రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి ఒక్క‌టిగా ప‌నిచేస్తేనే పార్టీకి మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. వీరిద్ద‌రి క‌దలిక‌ల‌పై జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటున్నార‌ని తెలుస్తోంది.

వైసీపీలో ముస‌లం…ఆ టాప్ లీడ‌ర్ల మ‌ధ్య యుద్ధం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share