నిమ్మ‌ల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా డెల్టాలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొల్లు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడు ముక్కోణ‌పు పోటీలో విజ‌యం సాధించారు. 1955లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మిన‌హా మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లోను టీడీపీయే విజ‌యం సాధించింది. టీడీపీకి నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోట‌. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మ‌ల రామానాయుడు ఈ మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశారు ? ఏం చేయ‌లేదు ? ఆయ‌న ప్ల‌స్సులు, మైన‌స్‌లు ఎలా ఉన్నాయో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.

ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి ఇక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, కోడి రామ‌కృష్ణ‌, అల్లు రామ‌లింగ‌య్య ఫ్యామిలీ పాల‌కొల్లుకు చెందిన‌వారే. నియోజ‌క‌వ‌ర్గం 1.63 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉండగా వీరిలో ప్రధానంగా కాపులు, బీసీల్లో బ‌ల‌మైన శెట్టి బ‌లిజ‌లు, వైశ్యులు, ఎస్సీలు ప్ర‌ధాన ఓట‌ర్లుగా ఉన్నారు.

అభివృద్ధి ఎలా ఉంది… స‌మ‌స్య‌లు ఏంటి

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ మూడున్న‌రేళ్ల‌లో ఎమ్మెల్యే నిమ్మ‌ల రూ. 350 కోట్ల నిధుల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశాన‌ని చెపుతుంటారు. పుష్క‌రాల టైంలో కొంత అభివృద్ధి జ‌రిగింది. ఇక ఎమ్మెల్యే మాట‌లు ఎలా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌కు లెక్కేలేదు. గోదావ‌రి ప‌క్క‌నే ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో చాలా గ్రామాల‌కు సరైన మంచినీటి సౌక‌ర్యం లేదు. ఇక పాల‌కొల్లు ప‌ట్ట‌ణంలోను చాలా ప్రాంతాల‌కు స‌రిగా నీరు అంద‌దు. మునిసిపాలిటీ ఏర్ప‌డి 98 ఏళ్లు కావ‌డంతో రోడ్ల విస్త‌ర‌ణ జ‌ర‌గ‌క చాలా ప్రాంతాలు ఇరుకుగా ఉంటాయి. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఎక్కువే. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల కేంద్రంగా ఉన్న య‌ల‌మంచిలికి బ‌స్సు సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో అక్క‌డ ప్ర‌జ‌ల బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే నిమ్మ‌ల కొబ్బ‌రినీళ్ల ప్యాకింగ్ ప్లాంట్ ఏర్పాటుపై ఇచ్చిన హామీ ఇంకా నెర‌వేర‌లేదు. ఏరియా ఆసుప‌త్రి అభివృద్ధిపై సైతం ఆయ‌న ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. ఇక ప‌ట్ట‌ణంలో డ్రైనేజ్‌లు ఘోరంగా ఉన్నాయి. ప‌ట్ట‌ణం అంతా మురుగునీటి కంపు కొడుతూనే ఉంటుంది.

రాజ‌కీయంగా ఎలా ఉందంటే…

రాజ‌కీయంగా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇప్ప‌ట‌కీ బ‌లంగానే ఉంది. స్వ‌త‌హాగానే టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆ పార్టీకి క‌లిసి రానుంది. టీడీపీకి గ‌ట్టి క్యాడ‌ర్ ఉండ‌డంతో పాటు ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌కు చేరువ‌లో ఉండ‌డంతో పాటు ఆయ‌న సొంతంగా చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా చేప‌డుతోన్న కార్య‌క్ర‌మాల‌తో పాటు ప్ర‌జ‌ల్లో నానేందుకు చేప‌డుతోన్న కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా కూడా ఇమేజ్ పెంచుతున్నాయి. ఇక విప‌క్ష వైసీపీ చాలా వీక్‌గా ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా రోజుకో వ్య‌క్తి పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. పార్టీ నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డం కూడా టీడీపీకి ప్ల‌స్ కానుంది. ఇక నిమ్మ‌ల తొలిసారే ఎమ్మెల్యేగా ఎన్నికైనా చంద్ర‌బాబు, లోకేష్ వ‌ద్ద ఆయ‌న‌కు మంచి మార్కులే ఉన్నాయి. అందుకే అటు పార్టీలో కీల‌క ప‌ద‌వితో పాటు ఇత‌ర జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు కూడా ఆయ‌న‌కు ద‌క్కాయి. అయితే ఇటీవ‌ల కొన్ని విష‌యాల్లో బాబు ఆయ‌న‌కు త‌లంటిన‌ట్టు కూడా టాక్‌.

కాంట్ర‌వ‌ర్సీ కింగ్ నిమ్మ‌ల‌…

ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లో బాగా నానుతున్నా అభివృద్ధి ప‌రంగా మాత్రం యావ‌రేజ్ మార్కులు వేయించుకున్న నిమ్మ‌ల ఇటీవ‌ల త‌ర‌చూ కాంట్ర‌వ‌ర్సీ కింగ్‌గా మారిపోయారు. ప‌ట్ట‌ణంలో స‌మాజ‌సేవ చేస్తోన్న వ్య‌క్త‌ల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ వాళ్ల‌పై లేనిపోని కేసులు పెట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. ఇక నీళ్ల కోసం రోడ్డు ఎక్కి ధ‌ర్నాలు చేస్తోన్న రైతుల‌పై కూడా ఆయ‌న కేసులు పెట్టిస్తున్నార‌ని విప‌క్ష నేత‌లు బ‌లంగా ఆరోపిస్తున్నారు. ఇక ఆయ‌న త‌ర‌చూ ప‌దే ప‌దే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఓ బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తుండ‌డంతో ఆయ‌న ప్ర‌ధాన మైన‌స్‌గా మారింది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో పాటు సొంత చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం

– అధిష్టానం వ‌ద్ద‌ మంచి మార్కులు

– కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌డం

– చెట్టు – నీరు ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో భారీ స్థాయిలో మొక్క‌లు నాట‌డం

మైన‌స్ పాయింట్స్ (-):

– నియోజ‌క‌వ‌ర్గంలో తాను చెప్పిందే వేదం

– పొజిష‌న్‌, అపొజిష‌న్ ఎవ‌రైనా త‌ప్పులు ఎత్తి చూపితే స‌హించ‌లేక‌పోవ‌డం

– నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు క‌న్నా ఫ్లెక్సీలు, ప్ర‌చార సంస్కృతిని ప్రోత్స‌హించ‌డం

– అధికారుల‌ను త‌న‌కు న‌చ్చినట్టుగా న‌డిపించ‌డం

– త‌న‌కు గిట్ట‌ని వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం

తుది తీర్పు:

పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లోను టీడీపీ టిక్కెట్ ఎమ్మెల్యే నిమ్మ‌ల‌కే ద‌క్కే ఛాన్సులు ఉన్నాయి. అయితే జ‌న‌సేన‌+టీడీపీ పొత్తు ఉంటే మాత్రం జ‌న‌సేన కూడా ఈ సీటు కోరే ఛాన్సులు ఎక్కువ‌. పాల‌కొల్లులో గ‌త మూడు ఎన్నిక‌ల్లోను ముక్కోణ‌పు పోటీ జ‌రుగుతోంది. ఈ మూడు ఎన్నిక‌ల్లో రెండుసార్లు టీడీపీ గెలిచినా, మ‌రోసారి కాంగ్రెస్ గెలిచింది. దీనిని బ‌ట్టి టీడీపీ గాలి బాగున్నా, జ‌న‌సేన ఎంట్రీ, ఆ పార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తుందా ? లేదా టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తుందా ? అన్న‌దానిని బ‌ట్టి ఇక్క‌డ టీడీపీ గెలుపు ఓట‌ములు డిసైడ్ కానున్నాయి. ఇక విప‌క్ష వైసీపీ చాలా చాలా వీక్‌గా ఉండ‌డం కూడా నిమ్మ‌ల‌కు చాలా ప్ల‌స్‌.