రోజా ఇలాకాలో టీడీపీకి లీడ‌ర్ లేడా..!

సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించి.. నిత్యం వార్త‌ల్లో నిలిచే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌గ‌రిలో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. అక్క‌డ అధికారంలో లేక‌పోయినా.. నిధులు మంజూరు చేసుకుని పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టిసారించాల్సిన నేత‌లు.. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారుతోంది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన‌.. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఎమ్మెల్సీ అయినా.. ఇప్ప‌టికీ జిల్లాల్లో కీల‌క‌మైన ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌డంలో వెన‌క‌డుగు వేస్తున్నారు. నాయ‌కుల నిర్లక్ష్యంతో రోజా ఇలాకాలో టీడీపీ డీలా ప‌డిపోయింది. అంతేగాక రోజురోజుకూ పార్టీ వీక్ అవుతోంది.

ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే వారిలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ముందు వ‌రుస‌లో ఉంటారు. అలాగే టీడీపీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు తొలుత వినిపిస్తుంది. అయితే వీరిద్ద‌రూ న‌గ‌రికి చెందిన వారే కావ‌డం విశేషం! ముఖ్యంగా ముద్దు కృష్ణ‌మ‌నాయుడు పార్టీపై కంటే రోజాను విమ‌ర్శించ‌డం పైనే దృష్టిసారించార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్ కోస‌మో లేదా రోజాను ఓ మాట అనేందుకో లేదా ఆమెపై పైచేయి సాధించాల‌న్నో ఆయ‌న తీవ్రంగా త‌ప‌న ప‌డుతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు అసంతృప్తితో ఉన్నార‌ట‌.

పదేళ్లు ప్రతిపక్షం, ఆపై టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచి పోతున్నా ఇంత వరకు నగరి నియోజకవర్గంలో ఒక్క పదవి కూడా ఇవ్వ‌లేద‌ని పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, ఇతర పాలక మండళ్లను భర్తీ చేశారు. కానీ నగరి నియోజకవర్గంలో మాత్రం ఆ ఊసే లేదు. ప్రధానంగా నగరి, పుత్తూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు 8 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. ఇవేగాక నగరి దేశమ్మ దేవాలయ పాలకమండలి ఏర్పాటులోనూ ఇదే పరిస్థితి. రెండేళ్ల‌లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఇప్పుడు పదవులు పొంది సాధించేదేముందంటూ ప‌రోక్షంగా గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయ‌డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మ‌రోప‌క్క వైసీపీ హ‌వా పెరుగుతోంది. ఎమ్మెల్యే రోజా సీఎం, మంత్రులనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే బాటలో స్థానిక శ్రేణులు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మున్సిపాలిటీలో కాంట్రాక్టు పనులు, అదేవిధంగా ఇటీవల మద్యం షాపులు దక్కించుకోవడంలో వైసీపీ నాయకులు పైచేయి సాధించారు. దీంతో ఇ ప్పటికైనా పార్టీలోని నిస్తేజాన్ని దూర చేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని పార్టీ నాయ‌కులు కోరుతున్నారు.