సోషల్ మీడియాకు లోకేష్ మ‌ళ్లీ దొరికారా?

పార్ట్ టైం పొలిటీషియ‌న్.. ఈ ప‌దం ఏపీ రాజ‌కీయాల్లో విప‌రీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ కొంత‌మందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియ‌న్‌` అని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. దీనిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇచ్చాడు. మ‌రి ప‌వ‌న్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియ‌ర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు ప‌డుతున్నాయి. పార్టీలో ఎంద‌రో పార్ట్ టైం పొలిటీషియ‌న్స్ ఉన్నార‌ని.. వారి గురించి ఆలోచించ‌కుండా వేరొక‌రిని ఎత్తి చూప‌డ‌మెందుక‌ని కౌంట‌ర్లు ఇస్తున్నారు.

మంత్రి అయిన‌ తర్వాత నుంచి కూడా లోకేష్ మాటలకు మీడియాలో చాలా ప్రాధాన్యమే దక్కుతోంది. ఇటీవ‌లే ఒక ఆంగ్ల పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్‌ని `పార్ట్ టైం పొలిటీషియన్` అంటూ ఓ డైలాగ్ పేల్చాడు. అంతటితో ఆగకుండా పార్ట్ టైం పొలిటిషియన్స్‌కి స్థానం లేదు అని అన్నాడు. రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన జ‌న‌సేనానిని కూడా పార్ట్ టైం పొలిటీషియ‌న్ అంటూ కొంత‌మంది అంటున్న‌ విష‌యం తెలిసిందే! పార్ట్ టైం పొలిటీషియ‌న్ అని తనను కొంత మంది విమర్శిస్తున్నారని పవన్ మాట్లాడిన మాటలు లోకేష్ డైలాగ్స్‌కి కౌంటర్‌లా కనిపిస్తున్నాయి. రూ. కోట్లు సంపాదించి కోట్ల‌ ఆదాయం వచ్చేలా చేసుకుంటున్నారని పవన్ అన్న మాటలు జగన్‌కి లోకేష్‌కి కూడా వర్తిస్తాయి.

పార్ట్ టైం పొలిటీషియన్స్ అంటూ తను చేసిన కామెంట్స్‌కి పవన్ ఇచ్చిన కౌంటర్‌పై లోకేష్ కూడా ఏమైనా స్పందిస్తాడేమే చూడాలి. పవన్ విషయం అలా ఉంటే పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ లోకేష్ దెప్పిపొడిచింది అసలుకైతే ఎన్టీఆర్‌ని. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇంతవరకూ స్పందించింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం లోకేష్‌పైనే కౌంటర్స్ పడుతున్నాయి. 2009లో చంద్రబాబుకు అవసరమై ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి దించి.. త‌ర్వాత‌ ఎన్టీఆర్‌ని పార్టీకి దూరం చేశాడ‌ని, ఇది తెలియ‌న‌ట్లు లోకేష్.. ఎన్టీఆర్‌ని పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శించడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ పార్ట్ టైమ్ పొలిటిషియ‌న్ అయితే.. ఆయ‌న మామ‌, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ పార్ట్ టైం పొలిటీషియన్ అవుతాడో కాదో చెప్పాలని సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్న‌వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. అయినా సొంత పార్టీలోనే మురళీ మోహన్, సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, బాలకృష్ణ.. ఇలా ఎందరో పార్ట్ టైం పొలిటీషియన్స్ కం బిజినెస్ పీపుల్‌ని పక్కన పెట్టుకుని పార్ట్ టైం పొలిటిషియన్స్ అంటూ ఇంకెవరినో విమర్శించే అర్హ‌త లోకేష్ ఉందా అని ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి.