ఎన్టీఆర్ స‌త్తా బాబుకు తెలిసిందా

అవును! ఎవ‌రి అవ‌స‌రాలు ఎప్పుడు ఎక్క‌డ ఎలా అవ‌స‌ర‌మ‌వుతాయో చెప్ప‌డం క‌ష్టం. ఇక‌, పాలిటిక్స్ అన్నాక ఈ అవ‌స‌రాలు మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి. సీనియ‌ర్ రాజ‌కీయ పండితుడిగా, సుదీర్ఘ అనుభ‌వం ఉన్న సీఎంగా చంద్ర‌బాబు ఈ విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. విష‌యంలోకి వెళ్తే.. నంద‌మూరి కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా గ‌తంలో ప‌నిచేసిన నంద‌మూరి హ‌రికృష్ణ‌ను బాబు పక్క‌న పెట్టేశార‌నే వార్త‌లు ఇటీవ‌ల కాలంలో జోరందుకున్నాయి. హ‌రితో బాబుకు ప‌నిలేద‌ని అందుకే సైడ్ చేశార‌ని కొంద‌రు కామెంట్ చేశారు.

అయితే, బాబు అంత పిచ్చివారు కాదు! హ‌రికృష్ణ‌ను దూరం చేసుకునే సాహ‌సం చేయ‌లేరు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి నంద‌మూరి వంశం. పార్టీ వ్య‌వ‌స్థాగ‌త అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క రామారావు.. కుమారుడుగా హ‌రికృష్ణ‌కు గ‌తంలో పార్టీలోనూ ప్ర‌భుత్వంలోనూ బాబు చోటు క‌ల్పించారు. ఈ వంశాన్ని దూరం చేసుకుంటే త‌న‌కు బ్యాడ్ నేమ్ త‌ప్ప‌ద‌ని బాబు భావిస్తున్నంద‌నే ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. అయితే, 2014కు ముందు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా హ‌రికృష్ణ పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసి దూరంగా ఉండిపోయారు.

అయితే, టీడీపీ పొలిటిక‌ల్ బ్యూరోలో మాత్రం ఈయ‌న ప‌ద‌వి ప‌దిలంగా ఉంది. దీనికి కార‌ణం.. హ‌రికృష్ణ వెనుక జూనియ‌ర్ ఉండ‌డ‌మే. తార‌క్‌తో అవ‌స‌రం బాబుకు ఎప్పుడైనా రావొచ్చు. 2009లో తార‌క్‌తోనే ప్ర‌చారం చేయించుకున్నారు. అయితే, అనూహ్యంగా అప్ప‌టి ఎన్నిక‌ల్లో బాబుకు అధికారం ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో తార‌క్.. బాబుకు దూరంగానే ఉంటూ వ‌స్తున్నారు. అయినా కూడా బాబు మాత్రం క‌ర్ర విర‌గ‌కుండా, పాము చావ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న‌కు ఎప్పుడు అవ‌స‌ర‌మైనా తార‌క్‌ను రంగంలోకి దింపుకొనేలా ఆయ‌న ప‌క్కా ప్లాన్‌లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే హ‌రిని పార్టీ నుంచి దూరం చేయ‌కుండా ఏదో ఒక ప‌ద‌విలో ఉంచుతూనే ఉన్నారు. ఇటీవ‌ల టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని కూడా హ‌రికి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా.. ఏదో కార‌ణాల మూలంగా ఈ విష‌యంలో బాబు వెన‌క్కి త‌గ్గారు. అయినా కూడా హ‌రికి పార్టీలో ప‌ద‌వి ఖాయం!!