ఎన్టీఆర్ వేదాంతంలో బాబు టార్గెట్ 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. సినిమాల్లో త‌న‌కంటూ సొంత ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్న నంద‌మూరి వంశాంకురం. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న తార‌క్‌.. తాజాగా జై ల‌వ‌కుశ పేరుతో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీ అందించేందుకు రెడీ అయ్యాడు. గురువారం విడుద‌ల కానుక్క ఈ మూవీకి సంబంధించి అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, ఈ మూవీ సొంత బ్యాన‌ర్‌పై తీయ‌డంతో నంద‌మూరి కుటుంబం కూడా భారీ అంచ‌నాలే పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే వారం ప‌ది రోజులుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టారు.

ఈ నేప‌థ్యంలో తార‌క్ టీవీల వాళ్ల‌తో మాట్లాడుతున్నారు. అయితే, ఆయ‌న మాట‌ల్లో.. ఒక్క‌సారిగా నిర్వేదం క‌నిపించింది. వేదాంతం చోటు చేసుకుంది. గ‌తంలో చేసిన త‌ప్పులు మ‌ళ్లీ చేయ‌కుండా ఉండాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు తార‌క్‌. ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఓ టీవీలో అడిగిన ప్ర‌శ్న‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చాడు. స్వర్గం నరకం లాంటి తాను నమ్మను అని చెబుతూనే.. ప్రతీ వ్యక్తికీ అతను చేసే మంచి పనులే సుఖ సంతోషాలను ఇస్తాయని అన్నాడు. ఈ జనరేషన్ లో మంచి పనులు చేస్తే… రాబోయే తరాలకు కూడా అది ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.

భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం గురించి అడిగిన‌ప్పుడు.. ‘‘భవిష్యత్తుల్లో నేను రాజకీయాల్లోకి రావొచ్చు. రాకపోవచ్చు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడం ఇష్టం లేదు. ఒకవేళ మాట్లాడితే తొందరపాటు అవుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి వెళ్తున్న దారిలోంచి కొంచెం పక్కకు వెళ్తాడు. నేనూ వెళ్లాను. అయితే మళ్లీ సరైన దారిలోకి రావడం నా అదృష్టం. నా అభిమానుల వల్ల, దర్శకుల వల్ల నేను వెనక్కి రాగలిగా. గతంలో చేసిన తప్పుల నుంచి ఎంతో నేర్చుకున్నా’’ అని బ‌దులివ్వ‌డం చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

2009లో అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వాను త‌ట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తార‌క్‌ను పొలిటిక‌ల్ గ్రౌండ్‌లోకి దింపారు. దీంతో ప్ర‌చారంలోకి దిగిన తార‌క్ అచ్చు 1980ల‌లో తాత నంద‌మూరి తార‌క రామారావు అరంగేట్రం చేసిన విధంగానే తాను కూడా ఖాకీ చొక్కా, ఖాకీ ఫ్యాంటు ధ‌రించి “నింగి ఒంగిందా? నేల ఈనిందా?“ అనే డైలాగుల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించారు. ఇక‌, త‌న ప్ర‌చారం ముగించుకుని వెళ్తుండ‌గా పెద్ద ప్ర‌మాదానికి గురై ఆస్ప‌త్రి పాలైన‌ప్పుడు కూడా అక్క‌డి నుంచే ప్ర‌చారం చేశాడు తార‌క్‌.

అయితే, వైఎస్ హ‌వా ముందు బాబు నిల‌వ‌లేక‌పోయారు. దీంతో టీడీపీ వ‌రుస‌గా రెండో సారి ఓడిపోయింది. అయితే, అప్ప‌ట్లో ఇంత‌గా త‌న పార్టీకోసం ప్ర‌చారం చేసిన తార‌క్ ను ఆ త‌ర్వ‌త బాబు ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఇప్పుడు త‌న కొడుకు లోకేష్ ఫ్యూచ‌ర్ ను దృష్టిలో పెట్టుకుని తార‌క్‌ను పాక్ బోర్డ‌ర్‌కు ఆవ‌లే నిల‌బెట్టేశారు. బ‌హుశ ఈ బాధ‌తోనే తార‌క్ ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా తార‌క్‌కు అభిమానుల అండ ఉన్నంత వ‌ర‌కు ఏ బాబులూ ఏం చేసినా చేయ‌క‌పోతే ఒక‌టేన‌ని తేల్చి చెబుతున్నారు.