బాబుపై జోకులేసుకుంటున్న అధికారులు

`నేను నిద్ర‌పోను.. మిమ్మ‌ల్ని నిద్ర‌పోనివ్వ‌ను` ఇదీ క్లుప్తంగా సీఎం చంద్ర‌బాబు థియ‌రీ! 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో `నేను మారాను` అన్నారు. `గ‌తంలో చూసిన నేను వేరు.. ఇప్పుడు నేను వేరు` అని స్పీచ్‌లు ఇచ్చారు. `గ‌తంలో చేసిన పొర‌పాట్లు మ‌ళ్లీ చేయ‌ను` అని హామీ ఇచ్చారు. అంతా న‌మ్మారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఉద్యోగులు, అధికారుల‌కు తిప్ప‌లు రెట్టింపు అయ్యాయి. వారి క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌టికొచ్చాయి. నెమ్మ‌దిగా చంద్ర‌బాబు ఉప‌న్యాసాల‌కు అల‌వాటు ప‌డిపోయిన వీరు ఇప్పుడు ఆయ‌న్ను లైట్ తీసుకుని జోకులేసుకుంటున్నార‌ట‌. అంతేకాదండోయ్‌.. ఉద్యోగులంతా చంద్ర‌బాబుకు ఒక వాచీ కొనిపెట్టాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. మ‌రి ఇదంతా ఎందుకు అంటే..

సీఎంగా చంద్ర‌బాబు ఉంటే అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టాల్సిందే! గ‌తంలో మాదిరిగా ప్ర‌భుత్వాధికారుల‌కు ఇబ్బందులు ఉండ‌వ‌ని కూడా ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో భ‌రోసా ఇచ్చారు! అయితే, సీఎం అయిన త‌రువాత‌.. ప‌రిస్థితి ఎప్ప‌టిలానే ఉంద‌ట‌. గంటల త‌ర‌బ‌డి స‌మీక్ష‌లు, స‌మావేశాలు!! అందులోనూ అధికారులు మాట్లాడేది తక్కువ‌.. ఆయ‌న మాట్లాడేది ఎక్కువ‌! ఇందులోనూ చెప్పిన విష‌యాన్నే ప‌దేప‌దే చెబుతూ.. అధికారుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. మొద‌ట్లో కొద్దిగా ఇబ్బంది ప‌డినా.. ఇప్పుడు సీఎం మీటింగుల్ని లైట్ గా తీసుకునే స్థాయికి వ‌చ్చేశారు! అంతేగాక‌, ఏకంగా సీఎం పైనే జోకులు వేసుకుంటున్నార‌ట‌!

గ‌త ముఖ్య‌మంత్రులు రాజ‌శేఖ‌ర్ రెడ్డిగానీ, ఎన్టీఆర్ గానీ ఏ స‌మీక్ష‌లు చేసినా అనుకున్న స‌మ‌యంలోనే ముగించేవార‌నీ… కానీ, చంద్ర‌బాబు మాత్రం అలా చేయ‌డం లేద‌ని మాట్లాడుకుంటున్నార‌ట‌. చంద్ర‌బాబుకు ఎందుకు టైమ్ తెలియ‌డం లేద‌న్న విష‌యంపై కూడా జోకులు వేసుకుంటున్నార‌ట‌. అదేంటంటే.. తానుపేద‌వాడిన‌ని, క‌నీసం వాచీ కూడా పెట్టుకోవ‌డం లేద‌ని చంద్ర‌బాబు చెప్పార‌నీ.. అందుకే, ఆయ‌న స‌మ‌యం చూసుకోవ‌డం లేద‌ని జోకులు వేసుకుంటున్నార‌ట‌. ఆయ‌న చేతికి వాచీ లేక‌వ‌డం వ‌ల్ల‌నే మీటింగులు సుదీర్ఘంగా సాగుతున్నాయ‌నీ, అంద‌రం క‌లిసి ఒక వాచీ కొనుగోలు చేసి, ఆయ‌న‌కి బ‌హుమ‌తిగా ఇస్తే బాగుంటుంద‌ని కూడా జోకులు పేల్తున్నాయ‌ట‌.

ఒక ముఖ్య‌మంత్రి నిర్వ‌హించే స‌మావేశాల‌పై ఇలాంటి అభిప్రాయం అధికారుల్లో రావ‌డం క‌రెక్ట్ కాదు క‌దా! సీఎం స‌మావేశాల్ని లైట్ గా తీసుకోవ‌డం మొద‌లైతే… అధికారుల్లో నిబ‌ద్ధ‌త త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన అంశాల‌పై అధికారుల ఫోక‌స్ ఇలానే లైట్ గా మారే ప్ర‌మాదం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది! ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ ఎంతో విజ‌న్ తో నిర్ణ‌యాలు తీసుకునే చంద్ర‌బాబు నాయుడు… త‌న సుదీర్ఘ మీటింగుల ప్ర‌భావం ఇలా ఉంటుంద‌ని విశ్లేషించుకోవ‌డం లేదా అనే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు.