ఏపీ కేబినెట్ మ‌ళ్లీ మారుతోందా..!

`సీఎం చంద్ర‌బాబుతో స‌మానంగా మంత్రులు ప‌రిగెత్త‌లేక‌పోతున్నారు. వారికి కేటాయించిన శాఖ‌ల‌పై ఇంకా ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారు`- ఈ మాట మూడేళ్లుగా ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంది. కొత్త ర‌క్తాన్ని ఎక్కించేందుకు ప్ర‌యత్నించి.. ఆ ముద్ర‌ను చెరిపేయాల‌ని భావించారు. ఇదే ఎన్నిక‌ల టీంగా భావించారు. కానీ మంత్రులెవ‌రూ ఆయ‌న ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఏం చేయాలా అని తీవ్రంగా మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ముఖ్యంగా మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని ద్వారా వీలైనంత వ‌ర‌కూ క్యాబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేసి.. స‌మ‌ర్థులైన వారికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నార‌ట‌.

మూడు నెల‌ల క్రితం జరిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌.. ఏపీలో సెగ‌లు పుట్టించింది. రాజీనామాలు, అల‌క‌లు, బుజ్జ‌గింపులు ఇలా ఒక్క‌టేమిటి.. తెలుగుదేశంలో ఎన్న‌డూ లేనంత అసంతృప్తి స్వ‌రం వినిపించింది. అయితే ఎన్నిక‌ల‌కు కూడా ఇదే బృందంతో వెళ్లాల‌ని భావించారు. ఐదుగురిని కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. మూడు నెల‌లు అయినా ఆశించిన స్థాయిలో వారు ప‌నిచేయ‌డం లేద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారని స‌మాచారం! ఇక సీనియ‌ర్లు కూడా

శాఖ‌ల‌పై ఇంకా పాల‌న‌పై దృష్టిపెట్ట‌లేక‌పోతుండ‌టంతో ఇక క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే టీమ్‌తో ఎన్నిక‌ల‌కు వెళితే దెబ్బ‌తినే ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

అందుకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించాలని చంద్రబాబు భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం!

కొత్త కేబినెట్ పనితీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అంత సంతృప్తిగా లేరని చెబుతున్నారు. శాఖల పై కూడా ఇప్పటి వరకూ కొందరు పట్టు సాధించకపోవడంతో మరోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అధినేత ఉన్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఇటీవ‌ల జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో.. ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లు త‌ప్ప మిగిలిన వారి శాఖ‌ల‌ను క‌దిలించే సాహ‌సం చేయ‌లేదు చంద్ర‌బాబు! కానీ ఇప్పుడు వారిపైనా వేటు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. తన అంచనాలకు తగిన విధంగా పనిచేయడం లేదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

ఇటీవల విస్తరించిన మంత్రివర్గం ఎన్నికల టీమ్ గా చంద్రబాబు భావించారు. మూడు నెలలుగా గమనిస్తే ఆయనకు వారి పనితీరు అంతగా నచ్చలేదని చెబుతున్నారు. ఇదే టీమ్ తో ఎన్నికలకు వెళితే దెబ్బ తింటామోనన్న ఆందోళనలో ఉన్నారట‌. సీనియర్లు తన పనితీరుపై కూడా టీడీపీ నేతల వద్ద నెగిటివ్ గా మాట్లాడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ కేబినెట్ తో ఎన్నికలకు వెళ్లలేమని భావించిన ముఖ్యమంత్రి మరోసారి విస్తరణ చేపట్టాలని, కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రెండేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.