చంద్ర‌బాబు స‌త్తా మ‌రోసారి రుజువైందిగా

ఎన్నిక‌ల్లో తానేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! త‌న వ్యూహాల‌కు తిరుగులేద‌ని.. ఎంతటి వారైనా త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు చిత్త‌వ్వాల్సిందేన‌ని రుజువుచేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. 15 రోజులు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.. నంద్యాల‌లోనే ఉండి ప్ర‌చారం చేసినా.. విజ‌యం సాధించ‌లేక‌పోయారు! ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు.. మాత్రం త‌న వ్యూహాల‌ను ప‌క్కాగా అమ‌లుచేస్తూ.. త‌న అభ్య‌ర్థిని గెలిపించుకున్నారు. త‌న‌కు ఎవ‌రి మ‌ద్ద‌తు లేక‌పోయినా.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి నంద్యాల‌లో స‌త్తా చాటారు చంద్ర‌బాబు!! 

నంద్యాల ఉప ఎన్నిక‌లను టీడీపీ, వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. చంద్ర‌బాబు పాల‌నకు రిఫ‌రెండంగా భావించిన ఈ ఎన్నిక‌ల్లో.. పోటాపోటీగా ప్ర‌చారం నిర్వ‌హించాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తొలి నుంచి ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్లారని విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు. అక్క‌డ మెజారిటీ ఓట‌ర్లను ఆక‌ట్టుకునేందుకు ముందుగా ప్ర‌చారంలో మంత్రులు, ఇత‌ర కీల‌క నాయ‌కుల‌ను రంగంలోకి దించారు. ఇక ప్ర‌చారం ముమ్మ‌రమవుతున్న స‌మ‌యంలో,, కాపుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు ఇస్తార‌ని అనుకున్నా.. ఆయ‌న చివ‌రి నిమిషంలో త‌టస్థంగా ఉంటామ‌ని చెప్ప‌డం కూడా టీడీపీని ఇబ్బందుల్లో ప‌డేసింది.

ఇక మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని కూడా ప్ర‌చారానికి దూరంగా ఉంచారు. ప్ర‌చారం చేస్తామ‌ని ఆ నాయ‌కులు కోరినా.. జెండాలు, కండువాలు వేసుకోకుండా రావాల‌ని చెప్పి షాకిచ్చారు. ఇందుకు కూడా కార‌ణం లేక‌పోలేదు. నంద్యాల‌లో మైనారిటీ ఓట్లు అధికం. దీంతో బీజేపీ ప్ర‌చారంలో వారి ఓట్లు టీడీపీకి దూర‌మ‌వుతాయ‌ని బీజేపీని దూరం పెట్టారు. ఇక ప‌వ‌న్ స‌పోర్ట్ లేక‌పోతే.. కాపులు టీడీపీకి దూర‌మైపోతార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. దీంతో పాటు కాపు ఉద్య‌మ ప్ర‌భావం కూడా ప‌డుతుంద‌ని విప‌క్ష స‌భ్యులు ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. కానీ వీట‌న్నింటినీ చంద్ర‌బాబు.. త‌న వ్యూహ‌చ‌తుర‌త‌తో ప‌టాపంచెలు చేశారు. ఎవ‌రి మ‌ద్దతు ఉన్నా లేక‌పోయినా.. టీడీపీ గెల‌వ‌గ‌ల‌ద‌నే న‌మ్మ‌కాన్ని శ్రేణుల‌కు ఇచ్చారు.