వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు

August 21, 2017 at 5:56 am
add_text

రాజ‌కీయాలు ఒక‌ప్పుడు నేత‌ల‌ను బ‌ట్టి మారుతుండేవి. కానీ, ప్ర‌స్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీల‌ను, రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే విప‌క్షం వైసీపీ విశాఖ‌ప‌ట్నంలో ఎదుర్కొంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం త‌గాదాలు మిన్నుముట్టాయ‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ కోసం ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారిని చేర‌దీయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ప్ర‌యోజనం ఉంటుంద‌ని భావించిన వైసీపీ.. నేత‌లు విశాఖ‌లో ఈ వ‌ర్గాన్ని చేర‌దీశార‌ట‌. 

అయితే,  అదేస‌మ‌యంలో మిగిలిన కులాల వారినీ స‌మానంగా ఆద‌రిస్తే.. ఏ ర‌గ‌డా ఉండేదికాదు.. కానీ, కాపుల‌ను ద‌గ్గ‌ర చేసిన వైసీపీ.. మిగిలిన కులాల‌ను ప‌క్క‌న పెట్టింద‌ట‌. దీంతో మిగిలిన కులాల‌కు చెందిన నేత‌లు ర‌గిలిపోతున్నార‌ని స‌మాచారం.  ముఖ్యంగా 2019లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. కేవ‌లం ఓ వ‌ర్గానికే ప‌రిమితం అవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అంతేకాదు,  కాపులను చూసి జబ్బలు చరచుకుంటే ఇతర కులాలు పార్టీ చేజారి అసలుకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్లు అంటున్నారు.

జిల్లాలో ప్రధాన కులాలుగా ఉన్న గవర, యాదవ, మత్స్యకార వెలమ, సామాజిక వర్గాలకు వైసీపీలో ప్రాధాన్యత త‌గ్గిపోయింద‌ని స్థానిక నేత‌లు చెబుతున్నారు. కేవ‌లం కాపు కులం కార్డును చూపించి వైసీపీలో కొంత మంది అసమర్ధులు పెత్తనం చేస్తున్నారని విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిని స‌రిదిద్దాల్సిన పార్టీ నేత‌లు.. కాపు వ‌ర్గాన్నే ప్రోత్స‌హిస్తున్నార‌ని అంటున్నారు.  రాజకీయంగా జూనియర్‌ అయిన గుడివాడ అమర్‌నాధ్‌కు మొత్తం జిల్లా బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీకి ఒనగూరింది శూన్యమన్న మాట వినిపిస్తోంది. అమర్‌నాధ్‌ సైతం తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

పార్టీలోని సీనియర్లను నిర్లక్ష్యం చేయడం, పొరుగు జిల్లా కాపునేత బొత్స సత్యనారాయణ ఆలోచనల మేరకు, ప్రత్యర్ధి పార్టీకి చెందిన గంటా ఆశీస్సులలో పనిచేయడం వల్ల వైసీపీ ఎప్పటికీ జిల్లాలో పటిష్టంకాలేని పరిస్థితి ఏర్పడిందన్నది పార్టీలోని మిగిలిన కులాల మాట‌. ఇటీవ‌ల పీకే జ‌రిపిన స‌ర్వేలోనూ విశాఖ వైసీపీకి నాయ‌క‌త్వ లేమి కొట్టొచ్చిన‌ట్టు బ‌య‌ట ప‌డింది. ఈ పరిస్థితులలో పార్టీలో కాపులకు ప్రాధాన్యత ఇస్తూనే ఇతర కులాలను కూడా అక్కున చేర్చుకో వాలన్న మాట గట్టిగా వినిపిస్తోంది.   మ‌రి వైసీపీ అధినేత ఇప్ప‌టికైనా విశాఖ పాలిటిక్స్‌పై దృష్టి పెడ‌తారో లేదో చూడాలి.

వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts