ప‌ళ‌నిస్వామికి చెక్ పెట్టేందుకు ప‌న్నీర్ కొత్త వ్యూహం

త‌మిళ‌నాడు పాలిటిక్స్‌లో గ‌త ప‌క్షం రోజులుగా ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న ఉత్కంఠ‌కు తాజాగా తెర‌ప‌డినా శ‌నివారం వ‌ర‌కు ఇంకా ఇది కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ళ‌నిస్వామి శ‌నివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ముందు నుంచి తానే సీఎం అవుతాన‌ని ధీమాగా ఉన్న ప‌న్నీరుకు షాక్ ఇస్తూ ప‌ళ‌నిస్వామి గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకుని సీఎం అయ్యారు.

దీంతో సీఎం పీఠంపై ఆశ‌ల‌తో ఉన్న ప‌న్నీరు రూటు మార్చారు. నేరుగా అమ్మ సమాధి వ‌ద్ద‌కు వెళ్లి దీక్ష‌కు దిగారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అమ్మ ఆశ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపే వ‌ర‌కు తాను పోరాటం చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌శ‌నిస్వామి ప్ర‌భుత్వానికి ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు మాత్ర‌మే ఉంద‌న్న ప‌న్నీరు త‌న‌కు ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. తాను త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను ప‌ర్య‌టిస్తాన‌ని కూడా చెప్పారు.

అన్నాడీఎంకేను శ‌శిక‌ళ వార‌స‌త్వ పార్టీగా మార్చే కుట్ర జ‌రుగుతోంద‌న్న ఆయ‌న‌…ప్ర‌స్తుతం ఉన్న‌ది అమ్మ పార్టీ కాద‌ని…శ‌శిక‌ళ పార్టీ అని దుయ్య‌బ‌ట్టారు. ఇదిలా ఉంటే ప‌ళ‌నిస్వామి శ‌నివారం అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ఇక ఈ లోగా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి పన్నీర్‌సెల్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్ర‌జాభీష్టం మేర‌కు న‌డుచుకోవాల‌ని…త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న ఎమ్మెల్యేల‌ను కోరుతున్నారు.

మ‌రోవైపు ప‌ళ‌నిస్వామి మాత్రం ఎమ్మెల్యేలు చేయి దాటిపోకుండా ఉండేందుకు వారిని రిసార్టులోనే ఉంచారు. ఏదేమైనా బ‌ల‌నిరూప‌ణ వ‌ర‌కు మ‌రోసారి త‌మిళ పాలిటిక్స్ హాట్ హాట్‌గానే ఉండ‌నున్నాయి. మ‌రి ప‌ళ‌నిస్వామిని దింపేందుకు ప‌న్నీరు ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.