త‌మిళ‌నాట.. క‌మ‌ల వికాసం!… నిజం చేసిన ప‌న్నీర్ ట్వీట్‌

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు స‌రికొత్త మ‌లుపు తిరుగుతున్నాయా? ద‌క్షిణాదిలో కేవ‌లం క‌ర్ణాట‌క‌, ఏపీల‌తోనే స‌రిపెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు తాజాగా త‌మిళ‌నాడులోనూ పాగా వేసేందుకు పావులు క‌దుపుతోందా? ఆ దిశ‌గా ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? ఆయ‌నకు త‌మిళ‌నాడు మాజీ సీఎం, అమ్మ‌కు విధేయుడు ప‌న్నీర్ సెల్వ‌ల మ‌ధ్య పొత్తు విష‌యంలో రాజీకుదిరిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

దీనికి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న ప‌న్నీర్‌.. పెట్టిన ట్వీటే పెద్ద సాక్ష్యం. అయితే, ఆయ‌న ప్ర‌జాగ్ర‌హానికి గుర‌వ్వాల్సి ఉంటుంద‌ని భావించి త‌క్ష‌ణ‌మే దానిని తొల‌గించారు. నిజానికి జ‌య‌ల‌లిత మ‌ర‌ణించాక ఏర్ప‌డ్డ రాజ‌కీయ అస్థిర‌త‌ను మోడీ, అమిత్ షాలు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే పార్టీ మ‌ద్ద‌తు పూర్తిగా ఉన్న‌ప్ప‌టికీ జ‌య నెచ్చ‌లి శ‌శిక‌ళ సీఎం కాకుండా గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుపెట్టి నాట‌కం ఆడించారు.

దీంతో ప‌న్నీర్ వ‌ర్గానికి త‌మ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా త‌మిళ‌నాడులోనూ పాగా వేయాల‌ని బీజేపీ భావించింది. అయితే, ప్ర‌స్తుతానికి త‌మిళ‌నాడులో బీజేపీకి ఎమ్మెల్యేలు ఎవ‌రూ లేరు. అయిన‌ప్ప‌టికీ.. రాబోయే భ‌విష్య‌త్తులో పాగా వేయాల‌నేది మోడీ, షా పొలిటిక‌ల్ ఎత్తుగ‌డ‌. అయితే, మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌న్నీర్ వ‌ర్గాన్ని అడ్డుపెట్టుకుని త‌మిళ‌నాడులో ఎద‌గాల‌ని మోడీ ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌న్నీర్ మ‌ద్ద‌తు కోరిన మోడీ.. ఈ సంద‌ర్భంగానే రాష్ట్రంలో బీజేపీ, ప‌న్నీర్ కూట‌మిగా ఎద‌గాల‌నే మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్ర‌ధాని మాట‌ను కాద‌న‌లేని ప‌న్నీర్ క‌లిసి పాలిటిక్స్ చేసేందుకు సిద్ధ‌మేన‌ని తెలిపిన‌ట్టు తెలిసింది. దీంతో చెన్నై రాగానే ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఇదే విష‌యాన్ని పోస్ట్ చేశారు. అయితే, త‌మిళ‌నాడులో క‌మ‌లాన్ని పెద్దగా ఆద‌రించ‌ని ప్ర‌జ‌లు.. ప‌న్నీర్ ట్వీట్‌తో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తార‌ని గ్ర‌హించి ఆ ట్వీట్‌ను తొల‌గించారు.

కానీ, త్వ‌ర‌లోనే త‌న మ‌ద్ద‌తు విష‌యం వెల్ల‌డిస్తాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. సో.. ఇప్ప‌టికే ఏపీలో అటు చంద్ర‌బాబుతోను, ఇటు జ‌గన్‌తోనూ జోడీకి సై అంటున్న మోడీ.. త‌మిళ‌నాడులోనూ క‌మ‌ల వికాసానికి పావులు క‌ద‌ప‌డం విశేషం. రాబోయే రోజుల్లో ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.