ప‌వ‌న్‌, మ‌హేష్ ఇలాగైతే క‌ష్ట‌మే బాబులు..!

ప్ర‌స్తుతం తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ మార్కెట్‌తో పాటు క‌ర్ణాట‌క, ఓవ‌ర్సీస్ మార్కెట్లు పెద్ద అక్ష‌య‌పాత్ర‌గా మారిపోయాయి. ఆమాట‌కు వ‌స్తే బాహుబ‌లి సినిమాతో మ‌న మార్కెట్ ఏకంగా ఇండియా వైజ్‌గా పాకేసి ఎల్ల‌లు దాటేసింది. ఇక బాహుబ‌లి లాంటి సినిమాల‌ను ప‌క్క‌న పెట్టేస్తే తెలుగు సినిమాల‌కు ఓవ‌ర్సీస్ పెద్ద అక్ష‌య‌పాత్ర అయిపోయింది. నైజాం మార్కెట్‌కు స‌మానంగా అక్క‌డ మ‌న సినిమాలు వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి.

దీంతో ఓవ‌ర్సీస్ మార్కెట్‌ను మ‌న తెలుగు వాళ్లు బాగా టార్గెట్ చేస్తున్నారు. అక్క‌డ మార్కెట్ పెర‌గ‌డంతో ఓవ‌ర్సీస్‌లో తెలుగు సినిమాల బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జ‌రుగుతోంది. మిగిలిన ఏరియాల్లో బిజినెస్‌లు ఎలా ఉన్నా ఓవ‌ర్సీస్ బిజినెస్ విష‌యంలో హీరోల ఇన్వాల్‌మెంట్ ఉంటుంది. ఇక్క‌డ సినిమా తేడా కొడితే రివ‌ర్స్ పేమెంట్లు ఉండ‌వు. ఇక్క‌డ అగ్ర హీరోలు కాస్తో కూస్తో బాధ్య‌త తీసుకుంటూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఓవ‌ర్సీస్ మార్కెట్ పెర‌గ‌డంతో మ‌న తెలుగు అగ్ర‌హీరోలు మ‌రీ అత్యాశ‌కు పోయి త‌మ సినిమాల ఓవ‌ర్సీస్ రైట్స్‌ను భారీ రేట్లు చెపుతున్నారు. బాహుబలి 2 సినిమా అక్క‌డ 20 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్ట‌డంతో ఇక మ‌న‌వాళ్లు ఆ సినిమాను బేస్‌గా చేసుకుని కొండ‌మీద‌కు వెళ్లిపోతున్నారు. త‌మ సినిమాల రేట్ల‌ను కూడా ఓ రేంజ్‌లో చెపుతూ బ‌య్య‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.

ఇటీవ‌ల రిలీజ్ అయిన బ‌న్నీ డీజే సినిమాను అక్క‌డ రూ. 9 కోట్ల‌కు అమ్మారు. కానీ ఈ సినిమాకు అక్క‌డ రూ. 4 కోట్ల భారీ న‌ష్టం వ‌చ్చింది. ఇది రిక‌వ‌రీ ఎమౌంట్ కాదు. పెద్ద సినిమాలతో ఓవర్సీస్ మార్కెట్ జూదం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక రుజువు. టాప్ హీరోల మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ సినిమాల ఓవ‌ర్సీస్ రైట్స్ విష‌యంలో కొండెక్కేసి బ‌య్య‌ర్ల‌తో ఆటాడుకుంటున్న‌ట్టు టీ టౌన్‌లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఓవ‌ర్సీస్‌లో తిరుగులేని స్టార్ అయిన మ‌హేష్‌బాబు చివ‌రి సినిమా బ్ర‌హ్మోత్స‌వం ఓవ‌ర్సీస్‌లో భారీ న‌ష్టాలు మిగిల్చింది. ఈ సినిమా దెబ్బ‌కు అక్క‌డ బ‌య్యర్లు నిండా మునిగిపోయారు. ఇక ప‌వ‌న్ రెండు సినిమాలు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు ప‌రిస్థితి కూడా అంతే. ప్ర‌స్తుతం సెట్స్‌మీద ఉన్న మ‌హేష్ స్పైడ‌ర్ సినిమా రైట్స్ ఏకంగా రూ. 20 కోట్లు చెపుతున్నార‌ట‌. ఈ లెక్క‌న స్పైడ‌ర్ అక్క‌డ 4 మిలియ‌న్ డాల‌ర్లు రాబట్టాలి. సినిమా సూప‌ర్ హిట్ అయితే త‌ప్ప అక్క‌డ లాభాలు రావు.

ఇక ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా రేటు కూడా రూ. 20 కోట్లు అట‌. సినిమా సూప‌ర్ హిట్ అవ్వాలి..అది కూడా 4 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌డితేనే బ‌య్య‌ర్లు సేఫ్ అవుతారు. ఏదేమైనా ఈ రెండు సినిమాల ఓవ‌ర్సీస్ రైట్స్ విష‌యంలో బ‌య్య‌ర్లు పెద్ద జూదం ఆడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక మ‌హేష్‌, ప‌వ‌న్ ఇన్వాల్ అయ్యి ఓవ‌ర్సీస్ రైట్స్ విష‌యంలో కాస్త రేటు త‌గ్గించాల‌న్న అభిప్రాయం ఓవ‌ర్సీస్ ట్రేడ్ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.