ప్ర‌శ్న‌ల‌తో సాధ్య‌మేనా ప‌వ‌న్‌..!

జ‌న‌సైన్యం ఇంకా సిద్ధం కాలేదు కానీ యుద్ధానికి సిద్ధ‌మ‌ని సంకేతాలు పంపుతున్నాడు! సంస్థాగ‌తంగా ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు.. కానీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా పోటీచేస్తాన‌ని స్ప‌ష్టంచేస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌! 2019 ఎన్నిక‌లు గానీ.. ముంద‌స్తు ఎన్నిక‌లు గానీ దేనికైనా.. ఎప్పుడైనా రెడీ అంటూ ఆయ‌న చేసిన ట్వీట్‌.. అభిమానుల‌ను ఫుల్ ఖుషీ చేసుండ‌చ్చు. ఎన్నిక‌లంటే ఎన్నో లెక్క‌లు.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రి. వీట‌న్నింటినీ బ్యాలెన్స్ చేస్తాన‌ని చెప్ప‌డం వెనుక‌ ప‌వ‌న్‌కు ఉన్న‌ది కాన్ఫిడెన్సా లేక ఓవ‌ర్ కాన్ఫిడెన్సా? అని విశ్లేష‌కులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో అన్న చిరంజీవి కూడా ఇలానే చెప్పి బొక్క‌బోర్లా ప‌డిన విష‌యం గుర్తుచేస్తున్నారు.

`ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధం` అంటూ ప‌వ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇంకా సంస్థాగతంగా స్థిరపడని `జనసేన` ఏ ధైర్యంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామ‌ని స్టేట్మెంట్ ఇచ్చిందో అర్థంకాని గంద‌ర‌గోళ ప‌రిస్థితిలో ఉన్నారు రాజకీయవేత్తలు. తాను పోటీచేస్తాన‌ని చెప్పిన అనంతపూర్ నియోజకవర్గం నుంచి జనసేన వర్కర్స్ రిక్రూట్మెంట్ మొదలు పెట్టారు. దీని తర్వాత ప్రకాశం జిల్లా.. ఇలా రెండు నెలలకు ఒక్కో జిల్లా కవర్ చేసుకుంటూ పోతే ఎంపిక‌ల‌కే సుమారు రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. ఈలోగా ఎన్నిక‌లు కూడా వ‌చ్చేస్తాయని విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు.

ఇక ఎన్నికల‌కు జనసేన సిద్ధమ‌ని చెప్ప‌డంలో చాలా అర్థాలు లేక‌పోలేద‌ట‌. ముఖ్యంగా అభ్యర్థుల ఖరారు ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో జరిగే పని కాదు. ఇక పార్టీని ప్రకటించినప్పటి నుంచి సందిగ్ధంలో ఉన్న పవన్.. ఈ మాత్రం అయినా ప్రచారంలో ఉంటున్నాడంటే అందుకు అభిమానులే కీల‌కం! పవన్ ని దేవుడిలా కొలుస్తూ.. అతను ఏం చేసినా పల్లకి మోసే అభిమాన గణం కోట్లలో ఉండటం.. అందులోనూ అధికులు సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉండటం జనసేనకు బాగా కలిసి వస్తున్న విషయమ‌ని చెబుతున్నారు. గ‌తంలో అన్న చిరంజీవి కూడా ఇలానే అతివిశ్వాసంతో ముందుకెళ్లార‌ని గుర్తుచేస్తున్నారు.

ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరో పక్క జనసేన విషయాల్లో యాక్టివ్ గా ఉండటం పవన్ ని బాగా ఇబ్బంది పెడుతోంది. అలా అని చెప్పి సినిమాలు మానేసి జనసేన వైపే తన దృష్టి పెట్టడం లేదు. అంటే పూర్తిగా సినిమాలు మానేసి ప్రజాసేవకు వస్తానని పవన్ ఇంకా చెప్పలేదు. ఎన్టీఆర్, చిరుల‌కు భిన్నంగా అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలు చేస్తూ.. ఎన్నిక‌లకు వెళ్ల‌గ‌ల‌రా? అని సందేహ‌ప‌డుతున్నారు. ఇంత కన్ఫ్యూజన్ పార్టీలో పెట్టుకుని ఎన్నికలకు సిద్ధం అనటం పవన్ తొందరపాటుకు మరో ఉదాహరణ అని విశ్లేషిస్తున్నారు.