ఏపీలో తాజా ప‌రిణామాలు రాజ‌కీయ వ్యూహాత్మ‌కమా ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూర‌లో ఓ క‌రివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. అస‌లు ప‌వ‌న్ రాజ‌కీయ ల‌క్ష్యం ఏంటి ? ప‌వ‌న్‌కు రాజ‌కీయాల్లో రాణించాల‌న్న క్లారిటీ ఉందా ? లేదా ? ప‌వ‌న్‌కు సినిమాలు ముఖ్య‌మా ? రాజ‌కీయాలు ముఖ్య‌మా ? అన్నదే ఇప్పుడు అంద‌రి మ‌దిలోను పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్‌గా మారుతోంది.

ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్‌తో ఓ సినిమా, దాస‌రి నిర్మించే మ‌రో సినిమా, కొర‌టాల శివ‌తో మ‌రో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు ఎన్నిక‌ల‌కు యేడాదిన్న‌ర టైం మాత్ర‌మే ఉంది. ఈ లోగా ప‌వ‌న్ ఇన్ని సినిమాలు ఎలా చేస్తాడో ? అర్థం కావ‌డం లేదు. ఇక పార్టీ సంస్థాగ‌త నిర్మాణం కూడా జ‌ర‌గ‌లేదు. ప‌వ‌న్ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోను, తెలంగాణ‌లోను జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను టీడీపీ, బీజేపీ బాగా వాడుకున్నాయి. టీడీపీ+బీజేపీ కూట‌మి అధికారంలోకి రావ‌డం వెన‌క పవ‌న్ పాత్ర కొట్టిప‌డేయ‌లేం. క‌ట్ చేస్తే ప‌వ‌న్ ఇప్పుడు ఈ రెండు పార్టీల‌కు క‌రివేపాకులా మారిపోయాడు. క‌లిస్తే ప‌వ‌న్ టీడీపీతోనో లేదా బీజేపీతోనో క‌లిసి పోటీ చేయాలి. టీడీపీతో క‌లిస్తే ప‌వ‌న్‌కు 30 సీట్లు ఇచ్చేందుకు కూడా చంద్ర‌బాబు అంగీక‌రిస్తారా ? అంటే డౌటే..! ఇక బీజేపీతో క‌లిసినా ప‌వ‌న్‌కు ఒరిగేదేమి ఉండ‌దు.

ఏపీ బీజేపీలో ఓ వ‌ర్గం టీడీపీతో అంట‌కాగుతోంది. రేపు బీజేపీ టీడీపీకి దూర‌మై జ‌న‌సేన‌తో జ‌ట్టుక‌ట్టినా బీజేపీ+జ‌న‌సేన మ‌ధ్య మ‌న‌స్సులు క‌లిసే సూచ‌న‌లు లేవు. బీజేపీ సైతం ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌ట్టేలా లేదు. ఇటీవ‌ల ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా చంద్ర‌బాబుతో మీట్ అయ్యారే త‌ప్ప ప‌వ‌న్ ఊసే లేదు. నాడు ప‌వ‌న్‌కు రెడ్ కార్పెట్ ప‌రిచిన చంద్ర‌బ‌బు, బీజేపీ వాళ్లు ఇప్పుడు ప‌వ‌న్‌ను వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెడుతున్నట్టే క‌న‌ప‌డుతోంది.

ప‌వ‌న్‌ను టీడీపీ, చంద్ర‌బాబు, బీజేపీ లైట్ తీస్కోవ‌డంపై జ‌న‌సేనాని అంత‌రంగం ఎలా ఉన్నా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాత్రం తీవ్ర ఆగ్ర‌హంగానే ఉన్నారు. ప‌వ‌న్‌ను వారి క‌రివేపాకులా వాడుకున్నార‌ని ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా జ‌న‌సేన ఒంట‌రిపోరు చేస్తే ఏపీలో అన్ని పార్టీల‌కు దెబ్బ‌ప‌డ‌డం ఖాయం.