గ్రామ‌స్థాయిలో బలోపేతానికి జ‌న‌సేనాని దూకుడు 

రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో.. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు జ‌న‌సేనాని అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నాడు. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం లేద‌ని, అస‌లు గ్రామ‌స్థాయిలో పార్టీ ఎక్క‌డ ఉందో తెలియ‌డం లేదంటూ వస్తున్న‌ విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇటీవ‌లే త‌న భవిష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప‌వ‌న్‌.. ఇప్పుడు అంతేవేగంగా రంగంలోకి దిగిపోయారు. జ‌న‌సేన సేవాద‌ళ్‌ను ప్రారంభించి.. మ‌రోసారి దూకుడును ప్ర‌ద‌ర్శించాడు.

ప్ర‌జాసేవ చేసేందుకు అవ‌ర‌స‌మైతే సినిమాల‌ను కూడా వ‌దులుకుంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి ఒక్క‌సారిగా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు కాట‌మ‌రాయుడు! అనంత‌పురం నుంచి త్వ‌ర‌లో పాద‌యాత్ర చేప‌డ‌తాన‌ని చెప్పి రాజ‌కీయాల‌ను హీట్ ఎక్కించాడు. పార్టీ స్థాపించి మూడేళ్ల‌యినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రినీ పార్టీలో నియ‌మించ‌లేదనే విమ‌ర్శ‌లు ప‌వ‌న్‌పై విప‌రీతంగా వ‌చ్చాయి. జ‌నం లేని జ‌న‌సేన అనే సెటైర్లు కూడా వినిపించాయి. ఇక వీట‌న్నింటికీ చెక్ చెప్పి.. జ‌న‌సైన్యాన్ని త‌యారుచేసే ప‌నిలో ప‌డ్డాడు జ‌న‌సేనాని! జ‌నసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన దూకుడును పెంచుతున్నారు.

ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులను ఎంపిక చేయడం ద్వారా జోరును పెంచిన పవర్ స్టార్ తాజాగా మరో కీలక విభాగానికి శ్రీకారం చుట్టారు. జనసేన సేవాదళ్ ను పార్టీ అధ్యకుడు పవన్ ఏర్పాటు చేశారు. సేవాదళ్ కేంద్ర కమిటీ ఆవిర్భావ సమావేశం హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి వరకు తన పార్టీ విస్తరణ ప్రణాళికలను పవన్ వివరించారు. జనసేనా సేవాదళ్ ప్రారంభించిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాడానికి సేవాదళ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సేవాదళ్ నియమావళిని ఈ సందర్భంగా విడుదల చేశారు. పది అంశాలతో కూడిన ఈ నియమావళిని సేవాదళ్ లోని ప్రతి కార్యకర్త పాటించాలని పవన్ కోరారు. రానున్న కొద్ది రోజులలో సేవాదళ్ ను విస్తృత పరుస్తామని వెల్లడించారు. తొలుత జిల్లాస్థాయిలో వందమంది కార్యకర్తలతో సేవాదళ్ సేవలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ఆ తరువాత మండల గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ ప్రకటించారు. ప‌వ‌న్ దూకుడు చూస్తే.. 2019 ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు మొద‌లుపెట్టిన‌ట్టే ఉంది. మ‌రి దీనిని కొన‌సాగిస్తాడో లేక మ‌ధ్య‌లోనే మ‌ళ్లీ సినిమాల హ‌డావుడిలో ప‌డిపోతాడో వేచిచూడాల్సిందే!!