చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ వెనుక అసలు కారణం?

చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ భేటీ అవుతున్నాడ‌నే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, ఇంత‌లోనే ఇది కేవ‌లం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేన‌ని తెలిసి అంద‌రూ నిరుత్సాహ‌ప‌డ్డారు. అయితే, నిజానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. బాబును క‌లుస్తోంది కేవ‌లం.. ఉద్దానం కోస‌మేనా? లేక ఇంకేమైనా విష‌యంపై చ‌ర్చించేందుకా? అనేది ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది. విష‌యంలోకి వెళ్తే..

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై తీవ్రంగా ఫైరైన జ‌న‌సేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా బహిరంగ సభలను పెట్టి ప్రత్యేక హోదా ఆవశ్యకతను గురించి పవన్ వివరించారు. ఈ సభల్లో బీజేపీపై నిప్పులు చెరిగిన పవన్ టీడీపీపై మాత్రం కొంత ఆచితూచి మాట్లాడారు. ఆ త‌ర్వాత రైతుల స‌మ‌స్య‌లు, ప‌శ్చిమ‌గోదావ‌రి ఆక్వా ప‌రిశ్ర‌మ బాధితుల ప‌క్షాన స‌మ‌స్య‌ల‌పైనా ఆయ‌న స్పందించారు.

కొన్ని సందర్భాల్లో ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ఆయ‌న విమ‌ర్శించారు. దీంతో ఇక‌, 2014 నాటి పొత్తును ప‌క్క‌న పెట్టి ప‌వ‌న్, బాబులు విడిపోయిన‌ట్టేన‌ని అంద‌రూ ఓ అంచ‌నాకు వ‌చ్చారు. దీనికితోడు ఆయ‌న ప్ర‌త్యేక హోదా కోసం గుంటూరులో కాంగ్రెస్ పెట్టిన స‌భ‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో ఈ అంచ‌నాలు నిజ‌మేన‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ ఇప్పుడు మ‌ళ్లీ బాబును క‌లుస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది.

2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ప‌వ‌న్ .. బాబుతో భేటీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మ‌ళ్లీ క‌లిసి పోటీకి దిగుదాం అనే విష‌యంపై ఇరువురూ దృష్టి పెడ‌తార‌ని అనుకుంటున్నారు. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీ నుంచి ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న‌ల‌తో పొత్తుకు ప్ర‌తిపాద‌న వ‌చ్చినా.. అది గెలిచే అవ‌కాశాల‌కు దూరంగా ఉంద‌ని అందిన స‌మాచారంతో మ‌ళ్లీబాబుతోనే క‌లిసి న‌డ‌వాల‌ని జ‌న‌సేనాని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.