క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ దెబ్బేశాడుగా! 

త‌న‌కు క‌మ్యూనిస్టులంటే గౌర‌వం ఉంద‌ని, వాళ్ల భావ‌జాలం.. త‌న భావ‌జాలంలో సారూప్య‌త ఉంద‌ని.. అవ‌స‌ర‌మైతే వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకైనా సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వ‌స్తున్నాడు. దీంతో క‌మ్యూనిస్టులు కూడా ప‌వ‌న్ త‌మ‌తో దోస్తీక‌డ‌తాడ‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. అయితే వారికి ప‌వ‌న్‌.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, విశాఖ భూ కుంభ‌కోణంపై ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని, ఇందుకు ప‌వ‌న్ కూడా తోడ‌యితే త‌మ‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని భావించిన క‌మ్యూనిస్టుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. విశాఖ‌లో భూ కుంభ‌కోణంపై.. ఒక రేంజ్లో స‌భ నిర్వ‌హించాల‌ని క‌ల‌లు గ‌న్న క‌మ్యూనిస్టుల‌కు ప‌వ‌న్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు.

ఆ మధ్య సీపీఐ నేత నారాయ‌ణ మాట్లాడుతూ.. జ‌న‌సేన‌, లోక్ స‌త్తాతో క‌లిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ మహాకూటమిని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. మొన్న‌టివ‌ర‌కూ వైసీపీతో దోస్తీ క‌ట్టాల‌ని భావించిన వారికి.. ప‌వ‌న్ రూపంలో మ‌రో కొత్త నేత ఎదురుకావ‌డంతో జ‌న‌సేన‌తోనూ క‌లిసేందుకు సిద్ధ‌మ‌ని వెల్ల‌డించాడు. ప‌వ‌న్ కూడా చాలా సంద‌ర్భాల్లో క‌మ్యూనిస్టుల ఉద్య‌మాల‌ను ప్ర‌శంసించ‌డం కూడా వారికి క‌లిసొచ్చింది. ఇదే ఊపులో వెళ్లిపోతున్నవారికి పవన్ కూడా ఇప్పుడు ఝలక్ ఇచ్చాడు. విశాఖ‌లో భారీ స్థాయిలో జ‌రిగిన భూ కుంభ‌కోణంపై భారీ స‌భ నిర్వ‌హించి.. అందులో ప్ర‌భుత్వాన్ని ఏకిపారేయాల‌ని భావించారు.

వైజాగ్ లో జగన్ ధ‌ర్నాను తలదన్నే రీతిలో ఆందోళన చేపట్టాలని భావించారు. తమ మహాకూటమిలో భాగం అయిన పవన్ కూడా వస్తే ఇక తిరుగుండ‌దు అనుకున్నారు. అందుకు సంప్రదింపులు జరిగినట్టుగా తెలుస్తోంది. పవన్ నుంచి సానుకూల స్పందన లేదు కదా.. ఇంత వరకూ వైజాగ్ భూముల వ్యవహారంపై ఆయ‌న మాట్లాడింది కూడా లేదు! అన్ని స‌మ‌స్య‌ల‌పై ట్విట‌ర్ లేఖ ద్వారా స్పందించే ప‌వ‌న్‌.. దీనిపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. దీంతో సినిమా హీరోలా గోడను కాలితో తన్ని కాలు విరగ్గొట్టుకున్నాడు నారాయ‌ణ‌. ఇక మిగతా వాళ్లు తమ రొటీన్ ధర్నాకూ, వైజాగ్ ధర్నాకూ తేడా లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసి మమ.. అనిపించారు.

మ‌రి ప‌వ‌న్ ఎందుకు రాలేదా అని ఆరాతీస్తే.. అసలు కథ బ‌య‌టికొచ్చింద‌ట‌. అదేంటంటే.. భూ కుంభకోణంలోని వ్యక్తులు పవన్ కు బాగా కావాల్సిన వ్యక్తులట. ఇందులో ప్ర‌ముఖంగా గంటా శ్రీనివాసరావు పేరు బ‌య‌టికి రావ‌డంతో ధర్నా చేయడానికి పవన్ కల్యాణ్ వెన‌క‌డుగు వేసిన‌ట్లు స‌మాచారం! అందుకే కమ్యూనిస్టుల ధర్నాకు పవన్ గైర్హాజ‌ర‌య్యాడ‌ట‌.