హోదాపై ప‌వ‌న్ కూడా ఢిల్లీకి దాసోహ‌మా?!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల ప‌రంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో స‌పోర్టింగ్‌గా మాట్టాడిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ సార‌థి.. అమిత్ షా విజ‌య‌వాడ గ‌డ్డ‌పై .. తాము హోదా క‌న్నా ఎక్క‌వే ఇచ్చామ‌ని, హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా ఇంత క‌న్నా ఏమీ ద‌క్క‌డం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

అంతేకాదు, లెక్క‌లు, ప‌త్రాలు అంటూ.. అంకెల‌తో స‌హా వివ‌రించారు. అంత‌టితో ఆగ‌కుండా ఐఐటీలు, ఐఐఎంలు, రోడ్లు.. ఇలా అన్నీ వ‌రుస పెట్టి మైకుముందు మొహ‌మాటం లేకుండా ముక్తాయించారు. తాము ఇస్తుండ‌బ‌ట్టే.. ఏపీ ఇలా ఉంద‌ని చెప్ప‌డంతోపాటు.. జూలై నెల‌లో విశాఖ‌కు వ‌చ్చే ప్ర‌ధాని మోడీకి ప్ర‌తి ఒక్క‌రూ హార‌తుల‌తో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టాల‌న్నారు. మ‌రి ఇంత‌లా షా .. ఏపీపై ఢిల్లీ వ‌రాల తుఫాను కురిపిస్తోంద‌ని చెబుతుంటే.. వినేవారికి ఏమ‌నిపిస్తుంది. నిజ‌మే క‌దా? అని అనిపించ‌క మాన‌దా?!

ఈ విష‌యంలో షా వ్యాఖ్య‌లను ఏపీలో అటు అధికార ప‌క్షం నుంచి విప‌క్షం వ‌రకు ఏ ఒక్క‌రూ ఖండించిన పాపాన పోలేదు. అయితే, అదే స‌మ‌యంలో రైజింగ్ టోన్.. ప‌వ‌న్ ఏమ‌న్నా స్పందిస్తాడా? అని కొంద‌రు ఎదురు చూశారు. నిజానికి మొద‌టి నుంచి ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ త‌న గ‌ళాన్ని సాన ప‌డుతూనే ఉన్నాడు. ముఖ్యంగా యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి రావాలంటే హోదాతోనే సాధ్యం అనే ప్ర‌చారాన్ని ప‌వ‌న్ బాగానే తీసుకెళ్లాడు.

మ‌రి అలాంటి ప‌వ‌న్ ఇప్పుడు షా కామెంట్ల‌కు రివ‌ర్స్ కామెంట్లు చేయ‌కుండా సైలెంట్ అయిపోవ‌డ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. పోనీ.. ఒక వేళ సినీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడ‌ని అనుకున్నా.. ట్వీట్ట‌ర్ వంటి సాధ‌నాల ద్వారా గ‌తంలో అనేక సార్లు ప‌వ‌న్ స్పందించాడు. ముఖ్యంగా విశాఖ బీచ్‌లో కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా ప‌వ‌న్ ఎవ్రి మినిట్‌కి స్పందించాడు.

మ‌రి ఇప్పుడు మాత్రం షా వ్యాఖ్య‌ల‌పై మౌనం పాటిస్తున్నాడు. దీని వెనుక ఏమై ఉంటుంద‌ని ఇప్పుడు పొలిటిక‌ల్ పండితులు నివ్వెర‌పోతున్నారు. సీఎం చంద్ర‌బాబు, విప‌క్ష నేత జ‌గ‌న్ మాదిరిగా ప‌వ‌న్ కూడా బీజేపీకి దాసుడై పోయాడా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.