ప‌వ‌న్ కూడా రెడీ..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు పాద‌యాత్ర‌లు బాగానే క‌లిసొస్తున్నాయి. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు సోద‌రి ష‌ర్మిల పాద‌యాత్ర చేసినా ఆమె పాద‌యాత్ర‌కు జ‌నాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత ప్లీన‌రీ సాక్షిగా తాను పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఏపీ రాజ‌కీయాల్లో అది పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

వైసీపీ అధినేత జ‌గ‌న్ నుంచి పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో ? ఇప్పుడు జ‌న‌సేన అధినేత అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సైతం పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ పార్ట్ టైం పొలిటీషియ‌న్ అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ ఓ వైపు సినిమాలు చేసుకుంటూ రాజ‌కీయ అంశాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే స్పందిస్తూ విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియ‌న్‌గా మారేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్‌కు పోటీగా ప‌వ‌న్ కూడా ప్ర‌జ‌ల్లో చొచ్చుకుపోయేందుకు పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇప్ప‌టికే జ‌న‌సేన ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ యేడాది చివ‌రినాటికి ఈ ఎంపిక‌ల‌తో పాటు జిల్లా క‌మిటీల ఎంపిక పూర్తి చేసి, వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి నుంచి ప‌వ‌న్ పాద‌యాత్ర ప్రారంభించేలా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అదే టైంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చివ‌రికి చేరుకుంటుంది. అంటే జ‌గ‌న్ పాద‌యాత్ర కంప్లీట్ అయ్యే టైంలో ప‌వ‌న్ పాద‌యాత్ర స్టార్ట్ అవుతోంది.

ఒకసారి క్షేత్ర స్థాయిలో అడుగుపెట్టాక మళ్లీ విరామం రాకూడదనే అభిప్రాయంతో ఒప్పుకున్న సినిమాలతో పాటు పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఇక వ‌చ్చే యేడాది నుంచి ప‌వ‌న్ పాద‌యాత్ర‌, ఆ తర్వాత వరుస‌గా జ‌నాల్లోకి వెళితే అప్పుడు జ‌న‌సేన రాజ‌కీయం తెలుగు పాలిటిక్స్‌ను హీటెక్కిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.