ఈసారి ప‌వ‌న్ మ‌ద్ద‌తు కాంగ్రెస్‌కేనా?!

ఏపీ కాంగ్రెస్ వేసిన ప్లాన్‌కి ప‌వ‌న్ భ‌లే స‌రెండ‌ర్ అయ్యాడే! అని ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆదివారం గుంటూరు వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక హోదా పోరుకు తెర‌దీసింది. దీనికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ కూడా వ‌చ్చారు. అయితే, ఇప్ప‌టికే ఏపీలో స‌స్పెక్ట్‌లో ప‌డిపోయిన కాంగ్రెస్‌.. ఇప్పుడు త‌న ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఉద్య‌మాన్ని తెర‌మీద‌కి తెచ్చింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు.. త‌మ స‌భ‌ను విజ‌యవంతం చేసుకునేందుకు ప‌క్కా ప్లాన్ వేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తిచ్చేవారంతా క‌లిసిరావాల‌ని ర‌ఘువీరా పిలుపునిచ్చారు. ముఖ్యంగా జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌కు ఆహ్వానం ప‌లికారు. ఈ వేదిక కాంగ్రెస్‌ది కాద‌ని, ప్ర‌త్యేక హోదా కోసం జ‌రిపే పోరేన‌ని దీనికి అంద‌రూ క‌లిసి రావాల‌ని అన్నారు. దీనికి జ‌గ‌న్ నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు కానీ.. ప‌వ‌న్ నుంచి మాత్రం ఊహించ‌ని రియాక్ష‌న్ వ‌చ్చింది. ఈ స‌భ‌ను తాను స్వాగ‌తిస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని సూచించారు. బహిరంగ సభల ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని పవన్ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీకి మా మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప సమయంలో తన దృష్టికి రాకపోవడంతో సభకు రాలేకపోయినట్లు వివరించారు. సో.. దీంతో ఇప్పుడు ఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ కు తెర‌లేచింది. రాబోయే 2019లో కూడా కాంగ్రెస్ ఇదే స్టాండ్‌తో ముందుకు వెళ్తే.. ప‌వ‌న్ దీనికే మ‌ద్ద‌తిస్తాడ‌ని అంటున్నారు. మ‌రి రాహుల్ స‌భ‌కి మ‌ద్ద‌తిచ్చినా… వెళ్లినా.. అభివృద్ధి నిరోధ‌కులే అంటూ కామెంట్లు చేసిన బాబు గారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!!